యాప్నగరం

మరో వివాదంలో కరాటే కళ్యాణి.. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు

యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి ఘటనతో కరాటే కళ్యాణి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా నగరంలోని వెంగల్‌రావు నగర్ కరాటే కళ్యాణి నివాసంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు నిర్వహించారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 15 May 2022, 6:27 pm
హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగల్‌రావు నగర్ కరాటే కళ్యాణి నివాసంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు నిర్వహించారు. పలువురు చిన్నారులను కిడ్నాప్ చేయడంతో పాటు రెండు నెలల పిల్లలను కొనుగోలు చేస్తున్నట్లుగా అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా నెలల పిల్లలు అడ్డుపెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు విచారణ కోసం కళ్యాణి నివాసం వద్దకు చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu కరాటే కళ్యాణి


ఇటీవల యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి ఘటనతో కరాటే కళ్యాణి వార్తల్లో నిలిచారు. యూట్యూబ్‌లో ప్రాంక్ వీడియోల పేరుతో బూతు వీడియోలు తీస్తూ.. మహిళలను అసభ్యకంగా చూపిస్తున్నాడని ఆమె శ్రీకాంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ.. తన అనుచరులతో కలిసి వాగ్వాదానికి దిగి.. దేహశుద్ధి చేశారు. ఈ దాడి ఘటనలో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు.

మరోవైపు కరాటే కళ్యాణి బాధితుల్లో తాము కూడా ఉన్నామంటూ గోపీకృష్ణ అనే బాధితుడు కూడా పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో ఓ ఇంటి విషయంలో కరాటే కళ్యాణి తమని బెదిరించి 3.5 లక్షల రూపాయలు వసూలు చేశారని అతను ట్వీట్టర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు చెల్లించినా.. ఇంకా అదనంగా ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. కరాటే కళ్యాణి పురుగులు మందు తాగిన వీడియో పంపి తమని భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు. శ్రీకాంత్ రెడ్డిపై ఘటనతో కరాటే కళ్యాణి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు.

కరాటే కళ్యాణి తల్లి వివరణ

కరాటే కళ్యాణికి సమాజ సేవ మీద మక్కువ ఎక్కువ అని ఆమె తల్లి విజయలక్ష్మి అన్నారు. సమాజ సేవ చేయడం కోసం కళ్యాణి ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. చిన్నప్పటి నుంచి సేవ చేయాలనే అభిలాష ఎక్కువ అని.. అందుకే కరోనా టైంలో కూడా ఎంతో మందికి సహాపడిందన్నారు. అనాథ పిల్లలను తీసుకువచ్చి కళ్యాణి పెంచుతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.