యాప్నగరం

రూ.2కే సేఫ్టీ ప్యాడ్.. నెలసరి సమస్యకు తెలంగాణ విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ

మహిళలు నెలసరి సమయంలో వాడేందుకు ఆర్గానిక్ సురక్షా ప్యాడ్‌ను తెలంగాణ విద్యార్థినులు రూపొందించారు. రూ.2కే ఒక్కో ప్యాడ్‌ను వీరు తయారు చేయడం విశేషం.

Samayam Telugu 5 Jan 2021, 2:39 pm
నెలసరి సమయంలో మహిళలు ఒకింత ఇబ్బంది పడుతుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే పీరియడ్ సమయంలో అసౌకర్యంగా ఉంటుంటారు. శానిటరీ ప్యాడ్లు వాడే వారికి కొద్దో గొప్ప ఫర్వాలేదు. కానీ వాటి ధర ఎక్కువ కావడంతో.. చాలా మంది ఆరోగ్యానికి శ్రేయస్కరం కాని పాత పద్ధతులనే అవలంభించి ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. శానిటరీ ప్యాడ్లను వాడినప్పటికీ.. అందులో ఉండే పాలిథిన్ త్వరలో భూమిలో కలిసిపోదు. ఆ ప్యాడ్లు వాడటం వల్ల కొందరికి దురద లాంటి సైడ్ ఎఫెక్ట్‌లు వస్తుంటాయి.
Samayam Telugu yadadri students


ఇలాంటి పరిస్థితుల్లో చౌక ధరలో.. త్వరగా భూమిలో కలిసిపోయేలా.. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేలా.. తెలంగాణ విద్యార్థినులు శానిటరీ ప్యాడ్లను రూపొందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ముల్కలపల్లి జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన అనిత, శైలజ, లలిత అనే ముగ్గురు విద్యార్థినులు నెలసరి సమయంలో వాడే ఆర్గానిక్ ప్యాడ్లను తయారు చేశారు. ఈ స్త్రీ రక్షా ప్యాడ్లలో కాటన్ లేయర్ల మధ్యలో.. గుర్రపు డెక్క ఆకు, వేప ఆకు, పసుపు, మెంతులు, సబ్జా గింజలు ఉంచారు. సబ్జా గింజలు, మెంతులు తడిని పీల్చుకుంటే.. వేప, పసుపు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా అడ్డుకుంటాయి.

ఒక్కో ప్యాడ్‌ను రెండు రూపాయలకే అందించేలా విద్యార్థినులు వీటిని రూపొందించడం విశేషం. ఈ స్త్రీ సురక్షా ప్యాడ్లకు స్కూల్ ఇన్నేవేషన్ ఛాలెంజ్‌లో ఫస్ట్ ప్రైజ్ దక్కింది. విద్యాశాఖ, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, యూనిసెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో తొలి బహుమతి దక్కించుకున్న ఈ విద్యార్థినులకు రూ.75 వేల నగదు బహుమతి అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.