యాప్నగరం

karimnagar: ఎంత పని చేశావయ్యా వార్డెన్.. ఆ విద్యార్థి బంగారు భవిష్యత్తు నాశనం చేశావ్ కదయ్యా..!

karimnagar: హాస్టల్ వార్డెన్ ఆదేశాల మేరకు పాఠశాల ఆవరణలోని బావి శుభ్రం చేసేందుకు వెళ్లిన ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సెలవు దినం కావటంతో స్కూల్‌లోని బావిని క్లీన్ చేయాలని హాస్టల్ వార్డెన్ విద్యార్థులను ఆదేశించాడు. దీంతో బావిలోకి దిగిన ఓ విద్యార్థి నీట మునిగి చనిపోయాడు. ఈ విషాదకర ఘటన కరీంనగరం జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 5 Dec 2022, 11:31 am

ప్రధానాంశాలు:

  • కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో దారుణం
  • పాఠశాలలో బావిని శుభ్రం చేయాలని విద్యార్థులను ఆదేశించిన వార్డెన్
  • బావిని శుభ్రం చేసే క్రమంలో నీటిలో మునిగి విద్యార్థి దుర్మరణం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu karimnagar student
కరీంనగర్
karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని ఓప్రైవేటు పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో బావిని శుభ్రం చేసేందుకు వెళ్లి ఎనిమిదో తరగతి చదవుతున్న విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన శ్రీనివాస్, రాధా దంపతలు బతువు దెరువు కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారి కుమారుడు శ్రీకర్‌ను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో అమ్మమ్మ, తాతయ్య ఉండటంతో వారి ఇంటి సమీపంలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో హాస్టల్‌లో ఉంచి చదవిస్తున్నారు.
నిన్న ఆదివారం సెలవు కావటంతో హాస్టల్ వార్డెన్ అక్కడ ఉన్న విద్యార్థులను పాఠశాల ఆవరణలోని బావిని శుభ్రం చేయాలంటూ ఆదేశించారు. దీంతో మరో ఆరుగురు విద్యార్థులతో కలిసి శ్రీకర్ బావిలోకి దిగాడు. అందులో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగిస్తూ ఉండగా.. నీటిలో మునిగిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులకు వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. వార్డెన్ గజ ఈతగాళ్ల సాయంతో బావిలో గాలించగా.. శ్రీకర్ మృతదేహం లభ్యమైంది.

విషయం తెలుసుకున్న శ్రీకర్ తల్లిదండ్రులు పాఠశాల ఆవరణకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కుమారుడు అకాల మరణం చెందటంతో వారి రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. చదువుల్లో రాణించి తమ కలల్ని నిజం చేస్తాడనుకున్న కుమారుడు విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి చనిపోవటంతో బంధువులు స్కూల్‌లో ఆందోళనకు దిగారు. స్కూలు యూజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించేది లేదని బీష్మించుకుర్చున్నారు.

రంగ ప్రవేశం చేసిన పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఎంఈవో శ్రీనివాసరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని సదరు పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన బంధువులు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో విద్యార్థి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

స్కూలు యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవులు చెప్పాల్సింది పోయి.. విద్యార్థుల చేత ప్రమాదకరమైన పనులు చేయించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా ఓ కుటుంటం తమ ఇంటి దీపాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ వార్డెన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు.
  • Read More Telangana News and Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.