యాప్నగరం

TRS కీలక సమావేశానికి హాజరవ్వని తుమ్మల నాగేశ్వరరావు.. మళ్లీ మొదలైన చర్చలు

Tummala Nageswara Rao: మాజీ మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో టీఆర్ఎస్ నిర్వహించిన కీలక సమావేశానికి ఆయన హాజరుకాకపోవవడం హాట్‌టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా టీఆర్ఎస్‌లో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన తుమ్మల.. పార్టీ మారే ఆలోచన లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా కీలక సమావేశానికి ఆయనను దూరం పెట్టడం గమనార్హం.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 19 Nov 2022, 1:00 pm

ప్రధానాంశాలు:

  • ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కీలక సమావేశం
  • హాజరవ్వని తుమ్మల నాగేశ్వరరావు
  • ఆహ్వానించలేదంటున్న మాజీ మంత్రి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu thummala nageswararao
తుమ్మల నాగేశ్వరరావు
Tummala Nageswara Rao: ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో కోల్డ్ వార్ నడుస్తోంది. నేతల మధ్య అంతర్గత విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తోన్నారు. ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని గులాబీ శ్రేణులు కలవరపడుతున్నారు. మంత్రి కేటీఆర్ సయోధ్య కుదిర్చేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా నేతలు మాత్రం పట్టు వీడటం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
శనివారం మరోసారి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఖమ్మం జిల్లా నుంచి వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ బండి పార్థసారథిరెడ్డిలకు రాజ్యసభ పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సత్తుపల్లిలో టీఆర్ఎస్ సమావేశం నిర్వహించింది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన ఈ కృతజ్ఞత సభ జరిగింది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా మంత్రి పువ్వాడ శ్రీనివాసరావు ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కీలక సమావేశానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకాకపోవడం చర్చకు దారి తీసింది.

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ముఖ్య నేతగా ఉన్న తుమ్మల హాజరుకాకపోవడం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కీలక సమావేశానికి హాజరుకాకపోవడంపై తమ్మల స్పందించారు. సత్తుపల్లి అభినందన సభకు ప్రార్థసారథిరెడ్డి ఆహ్వానించారని, పార్టీ పరంగా ఆహ్వానం లేకపోవడంతో హాజరుకాలేదని క్లారిటీ ఇచ్చారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే లేదా జిల్లా అధ్యక్షుడి నుంచి తనకు ఆహ్వానం అందలేదని తుమ్మల తెలిపారు. ఈ సమావేశానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవిని కూడా ఆహ్వానించలేదని తెలుస్తోంది.

గత కొంతకాలంగా తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్నారని, బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారనే వార్తలు జోరుగా వినిపించాయి. కానీ ఇటీవల తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలో తాను పార్టీ మారేది లేదని, సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానంటూ చెప్పుకొచ్చారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కేసీఆర్ వెంటే తుమ్మల ఎప్పుడూ ఉండేవారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత తుమ్మలను పట్టించుకోని కేసీఆర్.. ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదా ఇతర నామినేటెడ్ పదవులు ఏమీ ఇవ్వలేదు. దీంతో సీనియర్ నేతగా ఉన్న తనను కేసీఆర్ పక్కన పెట్టడంపై తుమ్మల అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి క్రమంలో కీలక సమావేశానికి తుమ్మల హాజరుకాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన తీరుపై మళ్లీ చర్చలు జిల్లా రాజకీయాల్లో మొదలయ్యాయి. టీఆర్ఎస్‌నే పొమ్మనలేక ఆయనకు పొగ పెడుతుందా? అనే అనుమానాలు ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతున్నాయి.

Read Latest Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.