యాప్నగరం

Kothagudem: భర్తను చంపి, ‘కారుణ్య’ ఉద్యోగం కోసం నాటకం

Kothagudem Attender Death: కట్టుకున్న భర్తను చంపి, అతడి ఉద్యోగం దక్కించుకునేందుకు ప్రయత్నించింది భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఓ మహిళ. కలెక్టరేట్‌లో అటెండర్‌గా పని చేస్తున్న భర్తను కొట్టి చంపి, మద్యం మత్తులో జారిపడ్డాడంటూ కపట నాటకానికి తెర తీసింది. చివరికి కొడుకు ఫిర్యాదుతో దోషిగా తేలింది. పోలీసుల విచారణలో తన నేరం అంగీకరించింది. అసలు ఏం జరిగింది? భర్తను ఎందుకు చంపాలనుకుంది? బాధితుడి కుమారుడికి ఎలా అనుమానం వచ్చింది?

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 5 Jan 2023, 11:50 pm
కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి గత నెల 29న అకస్మాత్తుగా మరణించాడు. మద్యం తాగొచ్చి ఇంట్లో జారిపడ్డాడని, తలకు గాయమైందని అతడి భార్య అతడిని ఆస్పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన తండ్రి మరణంపై తనకు అనుమానం ఉందంటూ కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో సంచలనం వెలుగులోకి వచ్చింది. అటెండర్‌ను అతడి భార్యే కొట్టి చంపిందని తేలింది. నిత్యం తాగొచ్చి వేధింపులకు గురిచేస్తున్న భర్త అడ్డుతొలగించుకోవడమే కాకుండా, అతడి ఉద్యోగం తనకు వచ్చేలా పథకం వేసి అలా చేసినట్లు అంగీకరించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu wife kills husband
ప్రతీకాత్మక చిత్రం


గాంధీ కాలనీకి చెందిన కె. శ్రీనివాస్‌ (50) కొత్తగూడెం కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నారు. అతడు తరచూ మద్యం తాగొచ్చి తనను కొడుతున్నాడని భార్య సీతామహాలక్ష్మి (43) పోలీసులతో చెప్పింది. భర్త వేధింపులు భరించలేక అతడి అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. డిసెంబర్ 29న రాత్రి ఆమె భర్త మద్యం తాగి ఇంటికొచ్చాడు. నిద్రలోకి జారుకున్న తర్వాత కర్రతో తలపై కొట్టింది. అనంతరం వంటగదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టింది. కొన్ని గంటల తర్వాత కొత్తగూడెం ఆస్పత్రిలో చేర్పించింది.

శ్రీనివాస్ మృతిపై అనుమానంతో అతడి కుమారుడు సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈలోగా ఆస్పత్రి వద్ద నుంచి సీతామహాలక్ష్మి కనిపించకుండా పోయింది. పోలీసులు అనుమానంతో ఆమెపై నిఘా పెట్టి.. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు రాగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె తన నేరం అంగీకరించింది. నిత్యం తాగొచ్చి వేధిస్తున్న భర్తను చంపేసి, కారుణ్య నియామకం కింద అతడి ఉద్యోగం దక్కించుకోవాలనే ఆలోచనతో హత్య చేసినట్లు నిందితురాలు పోలీసుల విచారణలో చెప్పిందని ఎస్సై సుమన్ తెలిపారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.