యాప్నగరం

కేసీఆర్ పాలనలో అన్నీ అవినీతి, అరాచకాలే.. బీజేపీకి ఒక్క చాన్స్ ఇచ్చి చూడండి: బండి సంజయ్

పేదల కష్టాలను తొలగించి సేవ చేసేందుకు బీజేపీకి అధికారమివ్వాలని కోరారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆగడాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఆ పార్టీలో చేరాలని బీజేపీ కార్యకర్తలు, నాయకులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

Authored byRaj Kumar | Samayam Telugu 2 May 2022, 8:36 am

ప్రధానాంశాలు:

  • నారాయణపేట జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర
  • పేదలకు సేవ చేసేందుకు బీజేపీకి అధికారమివ్వాలని వినతి
  • టీఆర్ఎస్ ఆగడాలు పెరిగిపోయాయని ఫైర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పాదయాత్రలో సంజయ్
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని ప్రజలు అవస్థలు పడుతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 18వ రోజు ఆదివారం నారాయణపేట జిల్లా నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి, లింగంపల్లి గేట్‌, ధన్వాడలో కొనసాగింది. పేదల కష్టాలను తొలగించి సేవ చేసేందుకు బీజేపీకి అధికారమివ్వాలని కోరారు. టీఆర్ఎస్ ఆగడాలు పెరిగిపోయాయని, ఆ పార్టీలో చేరాలని బీజేపీ కార్యకర్తలు, నాయకులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు సంజయ్. రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు పెంచి టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలపై భారం మోపిందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మేదర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. మేదరులు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని చెప్పుకొచ్చారు. కొల్లంపల్లి దర్గా స్టేజీ వద్ద మేదరలు ఏర్పాటు చేసిన వెదురు ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలనే విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మేదర నాయకులు బండి సంజయ్‌కి వివరించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అనంతరం లింగంపల్లి స్టేజీ వద్ద ఎస్టీ (లంబాడీ) సంఘం నాయకులతో సంజయ్‌ భేటీ అయ్యారు. తమకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసం చేశారని గిరిజనులు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక గిరిజనుల రిజర్వేషన్లను పెంచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని సంజయ్‌ హామీ ఇచ్చారు. ఈ నెల 5న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. పాదయాత్ర మధ్యాహ్న భోజన శిబిరం వద్ద ఉమ్మడి జిల్లా నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.