యాప్నగరం

రూ.5 లక్షల విలువైన బంగారాన్ని పోగొట్టుకున్న మహిళ.. ఊహించని రీతిలో ఆమె చెంతకు!

పది తులాల బరువై బంగారం బిస్కెట్, రూ.14 వేల నగదుతోపాటు భూమి పట్టాదార్ పాస్ బుక్‌ను ఓ ప్లాస్టిక్ కవర్లో ఉంచిన మహిళ.. దాన్ని బయటకు తీసుకెళ్లి ఎక్కడో పెట్టి మర్చిపోయింది.

Samayam Telugu 21 Jan 2021, 10:27 am
మనది అని రాసి పెట్టి ఉంటే.. ఎక్కడ పోగొట్టుకున్నా తిరిగి మన చెంతకే వస్తుందంటుంటారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ మహిళ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. కోడేరు గ్రామానికి చెందిన గొల్ల పొడేళ్ల నాగమ్మ (55) అనే మహిళ బంగారం బిస్కెట్‌తోపాటు నగదు, భూమి పట్టా పాస్‌బుక్ ఉన్న సంచిని పోగొట్టుకుంది. కానీ అనూహ్యంగా తిరిగి పొందింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Samayam Telugu Gold-istock


తన స్థలంలో వేసిన మామిడి చెట్ల నమోదు కోసం నాగమ్మ పంచాయతీ ఆఫీసుకు వెళ్లింది. అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో.. చాలా సేపు ఎదురు చూసింది. ఇక లాభం లేదనుకొని.. తన దగ్గరున్న పది తులాల బంగారపు బిస్కెట్, రూ.14 వేల నగదుతోపాటు పాస్ బుక్ ఉన్న ప్లాస్టిక్ కవర్ తీసుకొని బస్టాండ్ సెంటర్లో ఉన్న నూడిల్స్ సెంటర్‌కు వెళ్లింది.

ఆ కవర్‌ను అక్కడే మర్చిపోయిన నాగమ్మ కాసేపయ్యాక ఇంటికి వెళ్లింది. రాత్రి షాప్ మూసే ముందు.. నూడిల్స్ సెంటర్ నడిపే మహబూబ్‌కు ఆ కవర్ కనిపించింది. కానీ దాన్ని తెరిచి చూడలేదు. ఏదో ఉపయోగం లేని కవర్ అని భావించి.. చెత్త కుండీలో వేసి వెళ్లిపోయాడు.

ఇంటికెళ్లిన చాలా సేపటికి గానీ నాగమ్మకు కవర్ పోగొట్టుకున్న విషయం గుర్తుకు రాలేదు. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పడంతో.. ఆమె తిరిగిన ప్రాంతాల్లో కవర్ కోసం వెతికారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబ్‌కు రాత్రి తాను చెత్త కుండీలో ఓ ప్లాస్టిక్ కవర్ పడేసిన విషయం గుర్తొచ్చింది.

వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా.. ఆ కవర్ కుండీలోనే కనిపించింది. బంగారం, నగదు, పాస్ బుక్ అందులోనే భద్రంగా ఉండటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మహబూబ్‌‌కు థ్యాంక్స్ చెప్పి.. బహుమానంగా రూ.8 వేలు అతడి చేతిలో పెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.