యాప్నగరం

బైపోల్ టూరిజం.. మనుగోడులో అద్దె ఇళ్లు, లాడ్జీలకు ఫుల్ డిమాండ్.. చోటా నేతల పంట పండినట్టే!

ఉపఎన్నిక ఖాయం కావడంతో మునుగోడు నియోజకవర్గంలో అద్దె ఇల్లు, లాడ్జీలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నియోజకవర్గానికి ప్రధాన పార్టీల నేతలు తరలి వస్తుండటంతో.. వారు బస చేసేందుకు వీలుగా ముందుగానే ఇళ్లు, లాడ్జీలను బుక్ చేస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ హైవేపై ఉన్న చౌటుప్పల్ పట్టణంలో అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంటోంది. దీంతో ఇళ్ల యజమానులు అద్దెలు పెంచేస్తున్నారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 17 Aug 2022, 9:39 am

ప్రధానాంశాలు:

  • అనివారమైన మునుగోడు ఉపఎన్నిక
  • నియోజకవర్గానికి పెరిగిన నేతల తాకిడి
  • అద్దె ఇళ్లు, లాడ్జీలకు ఫుల్ డిమాండ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Munugode
మునుగోడు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. బీజేపీ తరఫున ఆయన బరిలో దిగనుండగా.. అభ్యర్థి ఎంపిక విషయమై టీఆర్ఎస్, కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇదే సమయంలో ఉపఎన్నికలో గెలుపు కోసం పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ ఛీప్ బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉపఎన్నిక ముగిసే వరకూ మునుగోడులోనే మకాం వేయనున్నారు. టీఆర్ఎస్ కూడా మంత్రి జగదీష్ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలకు ఉపఎన్నిక బాధ్యతను అప్పగించింది.
బైపోల్‌కు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే మునుగోడులో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల నేతలు నియోజకవర్గానికి మకాం మారుస్తున్నారు. ఆరు నెలల్లోపు ఎప్పుడైనా ఉపఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో.. అంతకాలం అక్కడ ఉండటం కోసం మంచి వసతులతో ఉన్న అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు. కొందరు బడా నేతలు హోటళ్లవైపు చూస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని అద్దె ఇళ్లు, హోటళ్లకు డిమాండ్ పెరిగింది.

గతంలో హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలోనూ ఇలాగే జరిగింది. మూడు పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలో మకాం వేయడంతో.. ఇళ్లు, హోటళ్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. అక్కడ పొలిటికల్ టూరిజం ఊపందుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి మునుగోడులో కనిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఉండే చౌటుప్పల్ పట్టణంలో అద్దె ఇళ్లు, లాడ్జీలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటి వరకూ రూ.10 వేలు పలికిన ఇల్లు, షట్టర్ అద్దెలు.. ఇప్పుడు రూ.15 వేలు దాటాయి. టీఆర్ఎస్‌తోపాటు.. రాజగోపాల్ రెడ్డి ఇళ్లు, లాడ్జీలను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారని తెలుస్తోంది.

అదే సమయంలో నియోజకవర్గంలోని చోటా నేతలకు కూడా డిమాండ్ పెరిగింది. ఓటర్లను ప్రభావితం చేయగల వారిని పార్టీలు తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ‘ప్యాకేజీ’లు ఆఫర్ చేస్తున్నాయి.

ఈ నెల 20న కేసీఆర్ సభ, 21న అమిత్ షా సభ ఉండటంతో... జన సమీకరణకు పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో ఈ సభకు అవసరమైన భూమి కోసం రైతులు సాగుచేసిన పత్తి పంటను పాడయ్యే పరిస్థితి తలెత్తింది. పరిహారంగా రైతులకు ఎకరానికి రూ.60 వేల వరకు ముట్టజెబుతున్నారని తెలుస్తోంది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.