యాప్నగరం

Munugode: "అందరిలాగే టికెట్ ఆశించాం.. కానీ.." టీఆర్ఎస్ ఆశావహుల స్పందన

Munugode: ఎట్టకేలకు మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి పేరును అధికార టీఆర్ఎస్ ప్రకటించింది. శ్రేణుల్లో చాలా రోజుల నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరే వినిపిస్తోన్నా.. ఈరోజే అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. అయితే.. మునుగోడు టికెట్ కోసం మొదటి నుంచే.. మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ ప్రయత్నాలు చేశారు. చివరికి కూసుకుంట్లకే టికెట్ ఇవ్వటంతో.. వారిని కేసీఆర్ బుజ్జగించారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలుంటాయని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వాళ్లేమన్నారంటే..

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 7 Oct 2022, 4:45 pm
Munugode: మునుగోడు ఉపఎన్నికలకు నోటిఫికేషన్ల పర్వం మొదలైన వేళ.. టీఆర్ఎస్ పార్టీ తన గెలుపు గుర్రాన్ని (Munugode TRS Candidate) ప్రకటించింది. ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు.. తన అభ్యర్థులను ముందుగానే ప్రకటించాయి. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) రాజీనామాతో అనివార్యమైన ఈ ఉపఎన్నికలో ఆయన బీజేపీ తరఫున బరిలో దిగుతున్నారు. కాగా.. ఇటు కాంగ్రెస్ పార్టీ.. పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi Reddy) కి టికెట్ ఇచ్చింది. ఈ క్రమంలో.. టీఆర్ఎస్ తరఫున ఎవరు ఎన్నికల్లో నిలబడి కలబడతారనేది ఇవ్వాల్టి వరకు ఉత్కంఠగా మారింది. మొదటి నుంటి మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి (Kusukuntla Prabhakar reddy) కే టికెట్ వస్తుందని వార్తలు వినిపిస్తోన్న.. అధికారికంగా మాత్రం పార్టీ అధిష్ఠానం ప్రకటించలేదు. కాగా.. మొదటి నుంచి టికెట్ కోసం పార్టీలోని సీనియర్లు ప్రయత్నించారు. అందులో బూర నర్సయ్య గౌడ్ (Burra Narsaiah Goud).. కర్నె ప్రభాకర్ (Karne Prabhakar) ముఖ్యులు. కాగా.. సుధీర్ఘ చర్చల అనంతరం.. గులాబీ బాస్.. కూసుకుంట్లకు టికెట్ కన్ఫర్మ్ చేశారు.
Samayam Telugu Munugode
మునుగోడు ఉపఎన్నిక


అయితే.. కూసుకుంట్లకు టికెట్ ఇస్తారన్న వార్తలను మొదటి నుంచి కర్నె ప్రభాకర్ వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పలుమార్లు తమ నిరసనను కూడా వ్యక్తం చేశారు. అసంతృప్తులను ప్రగతిభవన్ తీసుకొచ్చి మరీ.. మంత్రి జగదీష్ రెడ్డి బుజ్జగించారు. ఆ సమయానికి చల్లబడినా.. అక్కడక్కడా అంసతృప్తి స్వరాలు వినిపిస్తూనే వచ్చాయి. అన్ని సమీకరణాలను దృష్టిలోకి తీసుకున్న అధిష్ఠానం మాత్రం.. అందరూ అనుకుంటున్నట్టుగానే కూసుకుంట్ల పేరునే అధికారికంగా ప్రకటించింది. దీంతో.. ఆశావాహులను బుజ్జగించే బాధ్యత కేసీఆర్ మీద పడింది. ఇద్దరినీ ప్రగతిభవన్‌కు పిలిపించుకున్న కేసీఆర్.. వాళ్లను బుజ్జగించటంతో పాటు పలు హామీలు కూడా ఇచ్చినట్టు సమాచారం. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తరుణంలో.. భవిష్యత్తులో ఎన్నో అవకాశాలుంటాయని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌తో భేటీ అనంతరం.. ఆశావహులైన నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్.. చల్లబడ్డారు. కూసుకుంట్లను గెలిపించేందుకు కృషి చేస్తామంటూ ఇద్దరూ మీడియాకు చెప్పుకొచ్చారు. మునుగోడు అభివృద్ధి కోసం ప్రభాకర్‌ను గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరినట్టు తెలిపారు. కేసీఆర్ ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు.

'మునుగోడు ఉపఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్‌ను అధిక మెజార్టీ తోగెలిపించాలని కేసీఆర్ కోరారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమే తీసుకుంటారు. మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి ఏం లేదు. కేసీఆర్ నుంచి ఏమీ ఆశించలేదు. అందరిలాగా నేనూ టికెట్ ఆశించా. నాకు ఆ హక్కు కూడా ఉంది. అదే సమయంలో కేసీఆర్ నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది.' అంటూ.. కర్నె ప్రభాకర్ తెలిపారు.

'మునుగోడులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తా. టికెట్‌ ఆశించడంలో తప్పు లేదు. అయితే నా అవసరం జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ఉందని కేసీఆర్ చెప్పారు. అధినేత ఆదేశాలను తప్పక పాటిస్తాం' అని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చెప్పుకొచ్చారు.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.