యాప్నగరం

Nagarjuna Sagar: ‘తోకముడిచిన జానారెడ్డి’.. సంచలన వ్యాఖ్యలు

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. సీఎం కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం కావడంతో అధికార టీఆర్‌ఎస్ నేతలు దూకుడు పెంచారు. ప్రత్యర్థులపై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు.

Samayam Telugu 11 Feb 2021, 6:31 pm
నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ఆ పార్టీ సీనియర్ నేత కుందూరు జానా రెడ్డిపై ఉమ్మడి జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని జానా రెడ్డి చేసిన వ్యాఖ్యాలకు జగదీశ్ రెడ్డి కౌంటరిచ్చారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
jana reddy


కాంగ్రెస్ పార్టీ పీడ విరగడైంది కాబట్టే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని జానా రెడ్డి వ్యాఖ్యలు చేశారని.. అదే విషయంపై చర్చకు రమ్మంటే మాత్రం తోకముడిచారని ఘాటుగా వ్యాఖ్యానించారు. పనిలో పనిగా బీజేపీపైనా విమర్శలు గుప్పించారు. ప్రచార ఆర్భాటాలకు పోయే పార్టీ బీజేపీ అని.. అవినీతి అరాచకాలకు కాంగ్రెస్, బీజేపీనే పుట్టినిళ్లని మంత్రి ఎద్దేవా చేశారు. బీజీపీ నేతలు హద్దులు దాటి మాట్లాడుతున్నారని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

నాగార్జున సాగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తమ సీటును తిరిగి దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. సీనియర్ నేత జానా రెడ్డి బరిలో నిలవడం.. నియోజకవర్గంలో ఆయనకు బాగా పట్టుండడంతో ఈసారి ఎలాగైనా నెగ్గేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయంతో ఊపుమీదున్న బీజేపీ సైతం నాగార్జున సాగర్ సీటుపై కన్నేసింది. బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.