యాప్నగరం

12 స్థానాలకు 102 నామినేషన్లు, టీఆర్ఎస్‌‌కు ఇండిపెండెంట్ల షాక్

తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచిత్రాలు చోటుచేసుకున్నాయి. 12 స్థానాలకు గాను ఏకంగా 102 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.

Samayam Telugu 24 Nov 2021, 8:45 am

ప్రధానాంశాలు:

  • ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ముగిసిన గడువు
  • 12 సీట్లకు 102 నామినేషన్లు దాఖలు
  • టీఆర్ఎస్‌కు ఝలక్‌ ఇచ్చిన ఇండిపెండెంట్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలపగా.. కాంగ్రెస్ పార్టీ మెదక్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. స్థానిక సంస్థల్లో సంఖ్యా బలం లేనందు బీజేపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. మంగళవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో కలెక్టరేట్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. 26 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. డిసెంబరు 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు.
నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఇండిపెండెంట్‌ అభ్యర్థి నామినేషన్లను టీఆర్ఎస్ మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో 2 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి సైతం దాఖలు చేశారు. నిజామాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాస్‌ అనే వ్యక్తి నామినేషన్‌ వేయగా.. అందులో ‘మద్దతు సంతకాలు’ తమవి కావని ఇద్దరు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో వివాదం నెలకొంది.

కరీంనగర్‌లో రెండు స్థానాలకు గాను మొత్తం 27 మంది నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, మాజీ మంత్రి ఎల్‌.రమణ బరిలో నిలిచారు. తనకు కీలక పదవి ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయడంతో టీఆర్ఎస్ నేతలు కంగుతిన్నారు. మరో 24 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక స్థానానికి 24 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దండె విఠల్‌, మరో 23 మంది స్వతంత్రులు ఉన్నారు.

మహబూబ్‌నగర్‌లో 2 స్థానాలకు 10 మంది నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీలు కూచికుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మరో ఎనిమిది మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలుచేశారు. నల్గొండ జిల్లాలో ఒక స్థానానికి 11 మంది నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో 10 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్‌లో ఒక స్థానానికి ఏడుగురు నామినేషన్లు వేశారు. వీరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్‌ యాదవరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మలతో పాటు మరో ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.

ఖమ్మం జిల్లాలో ఒక స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుసూదన్‌, కాంగ్రెస్‌ తరఫున రాయల నాగేశ్వరరావులతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వరంగల్‌లో ఒక స్థానానికి 14 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మరో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.