యాప్నగరం

వరంగల్‌లో ఏబీవీపీ ‘తిరంగా’ ర్యాలీ

ABVP వరంగల్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. పౌరసత్వ సవరణ చట్టం భారత్‌లో ఉండే ఎవరికీ వ్యతిరేకం కాదని విద్యార్థి నేతలు వెల్లడించారు. కొన్ని పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

Samayam Telugu 8 Jan 2020, 8:05 pm
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ఆర్‌సీకి మద్దతుగా అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విద్యార్థి సంఘం వరంగల్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. బుధవారం (జనవరి 8) మధ్యాహ్నం వేయి స్తంభాల గుడి వద్ద నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. నగరంలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పబ్లిక్ గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ ప్రసంగించారు. సీఏఏ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని చెప్పారు.
Samayam Telugu తిరంగా ర్యాలీ


అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లోని మైనారిటీ వర్గాల వారికి లబ్ధి కలిగించేలా బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని ఏబీవీపీ నేతలు వివరించారు. ఈ చట్టంతో ఈ దేశ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు దీన్ని రాజకీయం చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ర్యాలీ దృశ్యాలను వీడియోలో వీక్షించవచ్చు.
సీఏఏకు మద్దతుగా అటు బీజేపీ శ్రేణులు వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రసంగించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఏఏను వ్యతిరేకించే వారంతా దేశద్రోహులేనని వ్యాఖ్యానించారు. వారికి ఈ గడ్డపై ఉండే అర్హత లేదన్నారు. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వెళ్లిపోవాలన్నారు. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవాలని.. బ్రేకుల్లేని బస్సుల్లో పంపిస్తామని ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.