యాప్నగరం

తెలంగాణలో పురాతన శాసనం గుర్తింపు.. ఇక వాళ్ల చరిత్ర గుట్టు బయటికి?

Kamareddy: పురాతన శాసనం కనుగొన్న ఇదే గ్రామంలో రాతి గుహలు, లోనికి మెట్లు ఉన్న బావులు, కొన్ని పేయింటింగ్‌లను కూడా పురావస్తు నిపుణులు గుర్తించారు.

Samayam Telugu 8 Aug 2020, 8:42 pm
తెలంగాణ పురాతన చరిత్రకు సాక్ష్యమైన శాసనమొకదాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం మాల్తుమ్మెద గ్రామంలో ఈ శాసనాన్ని గుర్తించారు. ఇది ఓ కొండపై ఉన్న పెద్ద బండరాయిపై ఐదు అక్షరాలతో చెక్కి ఉంది. అది అశోక బ్రహ్మీ లిపిలో ఉన్నట్లుగా నిపుణులు తేల్చారు. అయితే, ఈ పదానికి అర్థం ‘మాధవచంద’ అని చెప్పారు. ఇది ఓ వ్యక్తి పేరు అయి ఉంటుందని వారు భావిస్తున్నారు.
Samayam Telugu నిపుణులు కనుగొన్న శాసనం
Archeological experts discovers an inscription in kamareddy district


ఇది ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా కనుగొన్న మొదటి శాసనం అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలోని లిపి శాస్త్ర నిపుణుడు మునిరత్నం రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఈ శాసనాన్ని కనుగొనడం పట్ల గర్వంగా ఉందని, ఇది తెలంగాణ పురాతన చరిత్రకు అద్దం పడుతోందని పురావస్తు నిపుణులు అభిప్రాయపడ్డారు. తాజాగా కనుగొన్న ఈ శాసనం ఎంతో కీలకమైందని, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి సంబంధించిన వివరాలను విశ్లేషించేందుకు ఇది ఎంతగానో సాయపడుతుందని వారు వెల్లడించారు. ఈ శాసనం గతంలో కోటిలింగాల, ముక్కత్రావుపేట, ధూళికట్ట ఇతర ప్రాంతాల్లో కనుగొన్న శాసనాలకన్నా ఎంతో పురాతనమైందని భావిస్తున్నారు.

ఈ శాసనం చెక్కిన నాటి కాలం ఆధారంగా, ఇది తెలంగాణలో అప్పట్లో ప్రారంభదశలో ఉన్న శాతవాహనులకు చెందినదని చెప్పగలమని ఓ పురావస్తు నిపుణుడు చెప్పారు. ‘‘మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, మంజీరా, గోదావరి నదుల ఒడ్డున ఉన్న బోధన్, కొండపూర్ ప్రాంతాల చారిత్రకతను కూడా ఇది బలపరుస్తుంది. శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి పుట్టుక, తెలంగాణ ప్రాంతంలో వారి ఎదుగుదలను కనుగొనవచ్చు’’ అని నిపుణులు విశ్లేషించారు.

ఈ శాసనం కనుగొన్న ఇదే గ్రామంలో రాతి గుహలు, లోనికి మెట్లు ఉన్న బావులు, కొన్ని పేయింటింగ్‌లను కూడా పురావస్తు నిపుణులు గుర్తించారు. ఈ గుర్తులను బట్టి సదరు గ్రామంలో రాతి యుగం నుంచి నిరాటంకంగా మానవ మనుగడ ఉన్నట్లు అర్థమవుతోందని నిపుణులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.