యాప్నగరం

ఖబర్దార్ పవన్ కళ్యాణ్.. హిందువులపై చేసిన వ్యాఖ్యలపై రాజా సింగ్ ఫైర్

Raja Singh: హిందూ నాయకులను ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతపై తీవ్ర దుమారం రేగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. పవన్‌కు ఘాటుగా బదులిచ్చారు.

Samayam Telugu 3 Dec 2019, 1:21 pm
హిందువులను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. జనసేనాని వ్యాఖ్యలపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అసలు హిందువా, కాదా? జనసేన పార్టీలో హిందువులే లేరా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. హిందువుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. ‘ఖబర్దార్.. పవన్ కళ్యాణ్’ అంటూ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం (డిసెంబర్ 2) రాత్రి ఓ వీడియో విడుదల చేశారు.
Samayam Telugu pawan kalyan


సోమవారం సాయంత్రం తిరుపతిలో జనసేన కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మతాల పేరున విడగొడుతూ రాజకీయాలు చేసేది హిందూ రాజకీయ నేతలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనన్నారు.

గల్ఫ్ దేశాలకు వెళ్తే.. భారత్ గురించి గొప్పగా చెప్పేది ముస్లింలేనని.. దేశంలో గొడవలు పెట్టేది హిందూ నాయకులేనని పవన్ ఆరోపించారు. టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది కూడా హిందూ నేతలేనని ఆరోపించారు. హిందూ నాయకుల ప్రేరణ లేనిదే ఇలాంటివి జరగవని అన్నారు.

Also Read: వైద్యురాలి హత్యపై దేశం కంటతడి.. పెల్లుబుకుతున్న ఆగ్రహ జ్వాలలు

‘నేను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటే.. సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమే. మిగతా మతాల వారు ఇలాంటి పనులు చేయరు. నా మాటలు కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ, ఇది మాత్రం వాస్తవం’ అని పవన్ అన్నారు. పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సోషల్ మీడియాలో ఆయణ్ని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. జనసేన చిల్లర పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘హిందూ ధర్మం గురించి మీకు (పవన్ కళ్యాణ్) అవగాహన ఉందా. హిందూ మతం గురించి ఏం తెలుసని మొత్తం హిందువులనే టార్గెట్ చేశారు? సెక్యులరిజం అంటే ఏమిటో మీకు తెలుసా? ఇవన్నీ తెలిసే మాట్లాడుతున్నారా?’ అని రాజాసింగ్ ప్రశ్నించారు.

ఒకప్పుడు మీ అభిమానిని.. కానీ,
అసలు పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం ఏమిటని రాజాసింగ్ ప్రశ్నించారు. ‘హిందువులే ఉండొద్దా?’ అని నిలదీశారు. ఒకప్పుడు తాను పవన్ కళ్యాణ్ అభిమానినని.. ఇప్పుడు ఆయణ్ని పేరు పెట్టి పిలవాలంటేనే ఏదోలా ఉందని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

Also Read: గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి దుర్మరణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.