యాప్నగరం

తెలంగాణలో పెళ్లి వేడుకలో తళుక్కుమన్న చంద్రబాబు

TDP ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు కుమారుడి వివాహానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Samayam Telugu 12 Feb 2020, 3:53 pm
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. బుధవారం (ఫిబ్రవరి 12) ఉదయం అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చంద్రబాబు వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.
Samayam Telugu mechha


చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం అమరావతి నుంచి ఖమ్మం బయల్దేరి వెళ్లారు. దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమరావతి పరిరక్షణ ఉద్యమం పట్ల ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రజా చైతన్య యాత్ర చేపట్టనున్న టీడీపీ అధినేతకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

విజయవాడ, గొల్లపూడి, కొండపల్లి మీదుగా తిరువూరు చేరుకున్న చంద్రబాబు నాయుడుకి స్థానిక ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. అటు మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా మంగళగిరిలో జరిగిన రెండు వివాహ కార్యక్రమాల్లో తళుక్కుమన్నారు.

చంద్రబాబుకు స్వాగతం


2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మచ్చా నాగేశ్వరరావు అశ్వరావుపేట స్థానం టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లా నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. అయితే.. వీరిద్దరూ టీఆర్ఎస్‌ పార్టీలో చేరతారంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని వారు కొట్టిపారేస్తున్నారు.

తమకు టీఆర్ఎస్‌ నుంచి ఆహ్వానాలు వచ్చిన మాట నిజమే గానీ.. టీడీపీని వీడే ఆలోచనల లేదని మచ్చా నాగేశ్వరరావు ఇంతకుముందే స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పినా టీడీపీని వదిలి వెళ్లబోనని తెలిపారు. ప్రజలు తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని వ్యాఖ్యానించారు. నిరంతరం ప్రజల కోసమే పని చేస్తానని, పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

అధికార పార్టీలో చేరకపోతే నిధులు రావని, అభివృద్ధి కుంటుపడుతుందనేది అవాస్తవమని పేర్కొన్నారు. కేసీఆర్ మీద తనకు నమ్మకుముందని, అందరి ఎమ్మెల్యేలను సమానంగా చూస్తారని భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదని, చంద్రబాబు సారథ్యంలోనే ప్రజలకు సేవలు చేస్తానని తెలిపారు.

Also Read: హిందువులకు అక్బరుద్దీన్ క్షమాపణ చెప్పాలి: రాజాసింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.