యాప్నగరం

KCR National Tour: కేసీఆర్ దేశ పర్యటన టైమింగ్‌పై మోదీ ఎఫెక్ట్..?

KCR National Tour: దేశ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మే 27న తిరిగి హైదరాబాద్ రానున్నారు. కానీ అంతకు ఒక్క రోజు ముందే ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఐఎస్‌బీ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అంటే రాష్ట్ర పర్యటనకు వస్తోన్న ప్రధానికి సీఎం కేసీఆర్ స్వాగతం పలికే అవకాశాలు లేవన్నమాట. గతంలోనూ ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చిన సమయంలోనూ సీఎం ఆయన్ను కలవని సంగతి తెలిసిందే.

Authored byరవి కుమార్ | Samayam Telugu 21 May 2022, 2:18 pm

ప్రధానాంశాలు:

  • మే 26న రాష్ట్రానికి ప్రధాని మోదీ
  • జాతీయ పర్యటనలో సీఎం కేసీఆర్
  • మే 27న రాష్ట్రానికి తిరిగి రానున్న సీఎం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu kcr modi
PM Modi to visit Hyderabad on May 26
KCR National Tour | ప్రధాని నరేంద్ర మోదీ మే 26వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) 20వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీకి హైదరాబాద్‌లో ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. కానీ తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానికి సీఎం కేసీఆర్ స్వాగతం పలికే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో పర్యటించనుండటమే దీనికి కారణం.
సాధారణంగా ప్రధాని స్థాయి వ్యక్తి రాష్ట్ర పర్యటనకు వస్తే.. ముఖ్యమంత్రి స్వాగతించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ కేసీఆర్ జాతీయ పర్యటనలో (KCR National Tour) ఉన్నారు. దీంతో ప్రధానికి ఎవరు స్వాగతం పలుకుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకు ముందు ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు సైతం సీఎం దూరంగా ఉన్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ప్రధాని ముచ్చింతల్ రాగా.. జ్వరం వచ్చిందనే కారణంతో కేసీఆర్ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు.

అంతే కాదు ఢిల్లీలో ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన పలు అధికారిక కార్యక్రమాలకు సైతం సీఎం కేసీఆర్ (KCR) దూరంగా ఉన్నారు. ఏప్రిల్ 27న కోవిడ్‌పై రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. అదే రోజు టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఉండడంతో.. కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేదు. అధికారులు మాత్రమే ఆ సమావేశంలో పాల్గొన్నారు.

ఆ తర్వాత సీజేఐ ఎన్వీ రమణ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌లతో ఢిల్లీలో రెండు రోజులపాటు సదస్సు నిర్వహించగా.. ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ (PM Modi), ఏపీ సీఎం జగన్ (YS Jagan) తదితరులు హాజరయ్యారు, కానీ కేసీఆర్‌ మాత్రం దూరంగా ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి నిలయంలో సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌, హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రులకు ప్రధాని ఆధ్వర్యంలో ఇచ్చిన విందు కార్యక్రమానికి సైతం కేసీఆర్ వెళ్లలేదు.

గత కొన్ని నెలలుగా కేంద్రం తీరును తప్పుబడుతున్న కేసీఆర్.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయన మోదీ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలో ధర్నాకు సైతం దిగారు. తాజాగా జరిగిన పల్లె ప్రగతి సమీక్ష సందర్భంగానూ ఆయన కేంద్ర తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన ప్రధాని మోదీతో భేటీ కూడా కావడం లేదు. మోదీతో ముఖాముఖి ఇష్టం లేకే కేసీఆర్.. ఇలా దూరంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఎదురుపడేది ఎప్పుడో చూడాలి మరి..!
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.