యాప్నగరం

గోదావరి పరవళ్లను చూసి మురిసిన కేసీఆర్.. కాళేశ్వరం ఏరియల్ వ్యూ వీడియో

Kaleshwaram Lift Irrigation Project | కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పరవళ్లు తొక్కుతున్న గోదావరిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు.

Samayam Telugu 6 Aug 2019, 8:21 pm
కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త నడకను అందుకొని పరవళ్లు తొక్కుతున్న గోదావరిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ మురిసిపోయారు. పడిన కష్టానికి ఫలితం దక్కిందనే ఆనందం ఆయన ముఖంలో కనిపించింది. గోదావరి పరవళ్లను చూసిన తర్వాత తన మనసు పులకించిపోతోందని కేసీఆర్ అన్నారు. మంగళవారం (ఆగస్టు 6) కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మేడిగడ్డ వద్ద గోదావరి నదిని కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించారు. అనంతరం గోదావరి మాతాకు పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి ధర్మపురికి వచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు.
Samayam Telugu kcr


కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసిన ఇంజనీర్లను కేసీఆర్ అభినందించారు. తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తయినందుకు ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో 80 శాతం నీటి అవసరాలను తీరుస్తుందని సీఎం చెప్పారు. ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నట్లు తెలిపారు.

ధర్మపురి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. దేశం అబ్బురపడేలా తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా త్వరలో అద్భుత ఫలితాలను చూస్తామని చెప్పారు.

Read Also: దేశద్రోహులు కావొద్దు.. కశ్మీర్ బిల్లుకు మద్దతివ్వాలి: టీఆర్‌ఎస్ ఎంపీ నామా

అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలపై కేసీఆర్ కాలినడకన తిరిగి పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువన 150 కి.మీ. మేర నీరు నిలువ ఉండటాన్ని ఏరియల్ వ్యూ ద్వారా చూశారు. ప్రాణహిత నుంచి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వరద వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులకు కేసీఆర్ సూచించారు.

సీఎం కేసీఆర్


గోదావరి ప్రవాహానికి సంబంధించిన వివరాలను ఇంజినీర్లను అడిగి సీఎం తెలుసుకున్నారు. గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనంత వరకు నదిలో నీటిమట్టం ఉంచుతూ గేట్లను ఎత్తాలని సూచించారు. గోదావరిలో మొత్తం వరద తగ్గిన తర్వాతే గేట్లు మూసివేయాలని తెలిపారు.

గోదావరికి పూజ


ధర్మపురి ఆలయంలో ప్రత్యేక పూజలు
ధర్మపురి లక్ష్మి నరసింహాస్వామి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.