యాప్నగరం

నిర్మల్‌‌:‌ కరోనా రోగి అంత్యక్రియలు పూర్తి.. అష్టదిగ్బంధం, 100 బృందాలతో పరీక్షలు

Coronavirus కారణంగా మరణించిన వ్యక్తి అంత్యక్రియలను నిర్మల్ జిల్లాలో పూర్తి చేశారు. సదరు వ్యక్తి 36 మందిని కలిసినట్లు గుర్తించారు. ఆ ఇంటి పరిధిలోని కిలోమీటర్ వ్యవధిలో అష్టదిగ్భందం చేశారు.

Samayam Telugu 2 Apr 2020, 7:32 pm
నిర్మల్ జిల్లాలో కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలు గురువారం (ఏప్రిల్ 2) పూర్తయ్యాయి. అతికొద్ది మంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో నిబంధనల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ తెలిపారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తి కరోనాకు చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో బుధవారం మరణించిన సంగతి తెలిసిందే. అతడు 36 మందిని కలిసినట్లు అధికారులు గుర్తించారు. వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. మృతుడి ఇంటి నుంచి కిలోమీటర్ పరిధిలో అష్టదిగ్బంధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
Samayam Telugu death
నమూనా చిత్రం


100 బృందాలతో శుక్రవారం ఉదయం నుంచి నిర్మల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్ జిల్లా నుంచి మొత్తం 52 మంది మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్లు గుర్తించారు. ఇప్పటికే పలువురిని ఆస్పత్రలకు తరలించారు. నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.

Also Read: కరోనా అంటే వాళ్లకు ఏమాత్రం భయంలేదా?

బుధవారం ఒక్క రోజే రాష్ట్రంలో 30 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు రోగులు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9కి చేరుకుంది. వీరిలో ఆరుగురు ఢిల్లీకి వెళ్లొచ్చిన వారే కావడం గమనార్హం. నల్గొండ జిల్లాలో గురువారం తొలిసారిగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన నల్గొండ పట్టణానికి చెందిన ఐదుగురికి, మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఒక మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండలరావు తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో గురువారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. సంగారెడ్డి పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, నగర శివారు అంగడిపేట గ్రామానికి చెందిన మరో ఇద్దరు, జహీరాబాద్‌, కొండాపూర్‌ మండలాల్లో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరందరూ ఢిల్లీ మర్కజ్ భవన్‌లో ప్రార్థనలకు హాజరైన వారే కావడం గమనార్హం. వీరందరిలో ఐదుగురు 40 ఏళ్ల లోపువారేనని జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్ తెలిపారు.

Must Read: కరోనాతో మరణిస్తే పూడ్చిపెడతారా.. చాదర్‌ఘాట్‌లో కలకలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.