యాప్నగరం

హ్యాట్సాఫ్..! ప్రభాకర్ రావు ఇంట్లో విషాదం.. అప్పుడే శ్రీశైలం అగ్ని ప్రమాదం.. అయినా..

Telangana Transco: విద్యుత్ ఉద్యోగులందర్నీ తన కుటుంబ సభ్యులలాగే భావించే ఈయన.. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఘటనా స్థలాన్ని చూసి తీవ్రమైన విచారం వ్యక్తం చేశారు.

Samayam Telugu 26 Aug 2020, 5:22 pm
తెలంగాణలో విద్యుత్ రంగాన్ని సరికొత్త పథంలో పయనింపజేసిన సమర్థ అధికారిగా ట్రాన్స్‌ కో, జెన్ కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్ రావుకు పేరుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోతే విద్యుత్ కొరత ఏర్పడి చీకటి రాజ్యమేలుతుందనే వాదనలను పటాపంచలు చేస్తూ 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రణాళికలు వేయడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. అంతేకాక, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరూ ఆయనకు ఉంది. మరోవంక తోటి ఉద్యోగుల విషయంలో, మానవత్వంలో మాత్రం అగ్ర భాగాన నిలుస్తారని కూడా తాజాగా జరిగిన ఓ ఘటనతో నిరూపితం అయింది.
Samayam Telugu దేవులపల్లి ప్రభాకర్ రావు, తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ
D prabhakar rao


విద్యుత్ ఉద్యోగులందర్నీ తన కుటుంబ సభ్యులలాగే భావించే ఈయన.. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఘటనా స్థలాన్ని చూసి తీవ్రమైన విచారం వ్యక్తం చేశారు. ఆ దుర్ఘటన తనను ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగపరంగా ఈ విషాదం ఒకవైపు ఉండగా, వ్యక్తిగతంగానూ అదే సమయంలో ఇంట్లో మరో తీరని విషాదం ఆయనకు ఎదురైంది. అయినా, ఆయన తన నిబద్ధతను చాటుకుని ఆదర్శంగా నిలిచారు. సొంత కుటుంబం కంటే తాను పని చేసే సంస్థ, ఉద్యోగుల క్షేమమే తనకు ముఖ్యమని చాటారు.

ప్రభాకర రావు సోదరుడు శ్రీనివాసరావు (82) మంగళవారం వరంగల్‌లో మృతి చెందారు. అదే రోజు సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ అంత్యక్రియలు ముగిసిన కాసేపటికే సాయంత్రం శ్రీశైలం ప్రమాద ఘటనపై ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా ఆయన పాల్గొని తన నిబద్ధతను చాటుకున్నారు. తన ఇంట విషాదం కలిగి 24 గంటలైనా గడవక ముందే బుధవారం మళ్లీ శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లి సహాయక కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.