యాప్నగరం

హైదరాబాద్‌లో మళ్లీ భూప్రకంపనలు... భయాందోళనలో ప్రజలు

భూకంపం రావడంతో ఇంటి పైకప్పు పెచ్చులూడాయి. పలు ఇళ్లలో ఉన్న వస్తువులు చిందరవందరగా పడ్డాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

Samayam Telugu 23 Oct 2020, 8:47 am
హైదరాబాద్‌లో మరోసారి భూమి కంపించింది. ఎల్‌బినగర్‌ నియోజకవర్గంపై భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.ఇప్పటికే అకాల వర్షాలతో అనేక కాలనీలు వరద ముప్పునకు గురైన విషయం తెలిసిందే. దీనికి తోడు పలుచోట్ల నగరంలో ప్రకంపనలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. బియన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లోని హరిహరపురం, ఎస్‌కెడీనగర్‌, బియన్‌రెడ్డినగర్‌, వైదేహినగర్‌ కాలనీల్లో భారీ శబ్దాలతో భూమి కంపించింది. భూకంపం దాటికి కాలనీలోని ఓ ఇంటిపై కప్పు పెచ్చులూడటం, ఇండ్లలో ఉన్నటువంటి వస్తువులు చిందరవందరగా పడ్డాయి. దీంతో ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు.
Samayam Telugu హైదరాబాద్ భూకంపం
earthquake in Hyderabad


తెల్లవారుజాము కావడంతో గాఢనిద్రలో ఉన్న ప్రజలకు భారీశబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భూమికంపించడంతో ఆందోళన చెందిన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లవారుజామున 5.45 నిమిషాలకు భారీశబ్దంతో పలుసెకన్ల పాటు భూమి కంపించగా మరోమారు 6.40, 7.08 నిమిషాలకు కూడా మూడుసార్లు స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టార్‌స్కేలుపై 0.5గా నమోదు అయినట్లు జ్యువలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు నిర్దారించారు. ఈ ప్రకంపనలతో ఎలాంటి ప్రమాదం లేదని జ్యువలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ తివారి తెలిపారు.

Read More: తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం.. 1292కి చేరిన మరణాలు

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బియన్‌రెడ్డినగర్‌ కార్పొరేటర్‌ కాలనీల్లో పర్యటించి ప్రజలకు దైర్యం చెప్పారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని వారు తెలిపారు. ఇప్పటికే వర్షాలతో బాధపడుతున్న ప్రజలకు మరోవైపు ఈ భూకంప వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో కొందరు భయపడి ఇళ్లకు తాళం వేసి బంధువుల ఇంటికి పరుగులు పెడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.