యాప్నగరం

కొత్త సీఎస్‌గా సోమేశ్ కుమార్.. సీఎం కేసీఆర్ మరో ట్విస్టు

Somesh Kumar: తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 31 Dec 2019, 5:51 pm
కొత్త ఏడాది ప్రారంభానికి కొద్ది గంటల ముందు తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ మంగళవారం (డిసెంబర్ 31) మధ్యాహ్నం సంతకం చేశారు. చీఫ్ సెక్రటరీ ఎంపికపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించారు. వాస్తవానికి సోమేశ్ కుమార్ కంటే సీనియర్ అధికారి అయిన అజయ్ మిశ్రాకు ఈ పదవి దక్కుతుందని పలువురు భావించారు. అయితే.. అందరి ఊహాగానాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమేశ్ కుమార్ వైపే మొగ్గుచూపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సహా పలు కీలక పదవులు నిర్వహించడం ఆయనకు కలిసొచ్చింది.
Samayam Telugu somesh kumar


సోమేశ్ కుమార్ పదవీ కాలం 2023 డిసెంబర్ 31 వరకు ఉండగా.. అజయ్ మిశ్రా పదవీ కాలం మరో ఏడు నెలల్లో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో సోమేశ్ కుమార్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎస్‌గా నియమితులైన సోమేశ్ కుమార్ వెంటనే ఆ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం ప్రస్తుత సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి వీడ్కోలు సమావేశంలో ముఖ్యమంత్రితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఏపీకి కేటాయించినా ఇక్కడే..
వాస్తవానికి విభజన అనంతరం సోమేశ్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించారు. అయితే.. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)కు వెళ్లి ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతున్నారు. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సోమేశ్ కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందినవారు.

ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్ కుమార్, అజయ్ మిశ్రాతో పాటు చిత్రా రామచంద్రన్, అథర్ సిన్హా పోటీపడ్డారు. వీరందరిలో అజయ్ మిశ్రానే సీనియర్. దీంతో ఈ పదవిపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే.. దీర్ఘకాలం ఒకే సీఎస్ ఉండాలని భావించిన సీఎం కేసీఆర్.. సోమేశ్ కుమార్‌కు ఆ అవకాశం ఇచ్చారు. చివరి నిమిషంలో నిర్ణయం ప్రకటించడం అధికారులు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. సీఎస్ నియామకానికి సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా మంగళవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కొత్త సీఎస్‌ను ఎంపిక చేయగా.. ఆ వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జోషి పదవి విరమణ చేశారు.

Also Read: కేసీఆర్ 2019: ఆ ఒక్కటి మినహా అంతా సాఫీగా..

నీటి పారుదల సలహాదారుగా జోషి..
పదవీ విరమణ చేసిన శైలేంద్ర కుమార్ జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా ఆయణ్ని నియమించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. మంగళవారం సాయంత్రం బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో శైలేంద్ర కుమార్ జోషికి అధికారులు, ఉద్యోగులు వీడ్కోలు పలికారు.

Also Read: అమెరికాలో కారు ప్రమాదం.. హైదరాబాద్ యువతి బ్రెయిన్ డెడ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.