యాప్నగరం

మంత్రులు ఈటల, కొప్పుల, ఎర్రబెల్లికి చేదు అనుభవం

గ్రామాల్లో 30 రోజుల కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సమస్యలను పరిష్కరించనున్నారు.

Samayam Telugu 13 Sep 2019, 2:46 pm
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులకు శుక్రవారం చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వేర్వేరు చోట్ల మంత్రులు ఈటల, కొప్పుల, ఎర్రబెల్లిని అడ్డుకున్న ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారి కాన్వాయ్‌లను అడ్డగించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీశారు. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రులకు ఊహించనివిధంగా పలుచోట్ల నిరసన సెగలు తగలడం విశేషం. పెద్దపల్లిలో జరిగిన గ్రామాల్లో 30 రోజుల కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ శ్రేణులు అడ్డుతగిలాయి. తమ ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Samayam Telugu etala


అలాగే జగిత్యాలలోని కోడిమ్యాలలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు‌లకు ఇలాంటి అనుభవమే ఎదురవడం గమనార్హం. వారి కాన్వాయ్‌ను రైతులు అడ్డగించి తమ సమస్యలు పరిష్కరించాలని నిలదీశారు. తమకు సాగునీటిని అందించాలంటూ రామ్‌నగర్‌ రైతులు మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకుని ఘోరావ్ చేశారు. అంతేకాదు, కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ వాహనాలను స్థానిక ప్రజలు అడ్డుకోగా.. ఆందోళన కారులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. రామ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లోని నాలుగు గ్రామాల్లో తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.