యాప్నగరం

Yadadri: భారీ భద్రత మధ్య హరే రామ ఆశ్రమం కూల్చివేత

Hare Rama Hare Krishna Ashram: యాదగిరి గుట్టలో హరే రామ హరే కృష్ణ ఆశ్రమాన్ని అధికారులు కూల్చివేశారు. అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు.

Samayam Telugu 25 Sep 2019, 12:15 am
యాదగిరిగుట్టలో ‘హరే రామ హరే కృష్ణ’ ఆశ్రమాన్ని అధికారులు నేలమట్టం చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆశ్రమాన్ని జేసీబీల సహాయంతో కూల్చివేశారు. యాదాద్రి కొండ చుట్టూ నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా మంగళవారం (సెప్టెంబర్ 24) ఉదయం దీన్ని పూర్తి చేశారు. కూల్చివేతను అడ్డుకోవడానికి బీజేపీ, ఆరెస్సెస్ తదితర హిందూ ధార్మిక సంఘాల సభ్యులు వస్తారని భావించి ముందస్తు చర్యలు తీసుకున్నారు. అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉండటంతో యాదగిరిగుట్ట ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Samayam Telugu hare rama


యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డుతో పాటు నలువైపులా నుంచి వచ్చే రహదారులను కలుపుతూ ఆరు లైన్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్డు నిర్మాణంలో భూమి, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు 2013-భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

Also Read: TCS ఉద్యోగిని ఆత్మహత్య.. సీసీటీవీలో దృశ్యాలు

రీజినల్ రోడ్డు నిర్మాణానికి హరే రామ హరే కృష్ణ ఆశ్రమం అడ్డు వస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ ఆశ్రమానికి రూ. కోటిన్నర నష్ట పరిహారం చట్టప్రకారం డిపాజిట్ చేసింది. అయినప్పటికీ ఆశ్రమానికి సంబంధించిన వ్యక్తులు స్పందిచలేదు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆశ్రమాన్ని తొలగించలేదని ఆర్డీవో తెలిపారు.

ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా, చర్చలకు ఆహ్వానించినా ఆశ్రమ నిర్వాహకులు స్పందించకపోవడం వల్ల ఉన్నతాధికారుల ఆదేశాలతో చట్ట ప్రకారం ఆశ్రమాన్ని నేలమట్టం చేశామని ఆర్డీవో తెలిపారు. కూల్చివేత సమయంలో ఆశ్రమంలో లభించిన కృష్ణుడి చెక్క విగ్రహాలు, ఇతర సామగ్రిని యాదాద్రి దేవస్థానానికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.