యాప్నగరం

హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో రెండు రోజులు ఇంతే..

Telangana Weather: రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్రం దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

Samayam Telugu 31 May 2020, 2:49 pm
హైదరాబాద్‌ నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ మధ్య, నాగోల్‌, బీఎన్‌ రెడ్డి నగర్, మీర్‌పేట, హస్తినాపురంలో దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది. ఉప్పల్‌ నుంచి సికింద్రాబాద్‌ మధ్య, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, ఈసీఐఎల్‌, నాచారం, ఇబ్రహీంపట్నం, దిల్‌సుఖ్‌నగర్‌, సంతోష్‌నగర్‌, మలక్‌పేట, అఫ్జల్‌గంజ్‌, మోహిదీపట్నం, లక్డికాపూల్‌, కోఠి, నారాయణగూడ, అంబర్‌పేట, రాంనగర్‌, సోమాజిగూడ, బంజారాహిల్స్‌, హైటెక్‌సిటీ, గచ్చిబౌలిలో కూడా పెద్ద వర్షం పడింది. దీంతో నిన్నటి వరకూ ఎండలు, వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అయిన నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చాలా చోట్ల ప్లెక్సీ హోర్డింగులు కింద పడిపోయాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Rains in Hyd


హైదరాబాద్ సహా తెలంగాణలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొద్ది రోజుల క్రితం ముందస్తుగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.

రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్రం దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తదుపరి 48 గంటలలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని వలన సుమారుగా జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అన్నారు. ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలో 2.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు.

మరోవైపు, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవులు వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళ మీదుగా దాదాపు కిలో మీటరు ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరో రెండు రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.