యాప్నగరం

గుంతలతో నా జీవితాన్ని రిస్క్‌లో పడేశారు.. జీహెచ్ఎంసీపై యువకుడి ఫిర్యాదు

వర్షాల కారణంగా హైదరాబాద్ రోడ్లు గుంతలమయంగా మారాయి. నగరంలో ఎక్కడికి వెళ్లినా రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. గుంతల కారణంగా ఓ యువకుడు బైక్ మీది నుంచి కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు.

Samayam Telugu 11 Oct 2019, 8:08 am
ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా గుంతలతో వాహనదారులకు నరకం చూస్తున్నారు. ఇక వర్షం పడిన సమయంలోనైతే.. రోడ్డ మీద నీరు నిలిచిపోవడంతో.. ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ మ్యాన్‌హోల్ ఉందో కూడా తెలియని దుస్థితి. రోడ్డు మీద గుంతల కారణంగా బైక్ మీద వెళ్లే చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. పాతబస్తీలోని డబీర్‌పురాకు చెందిన సయ్యద్ అజ్మత్ హుస్సేన్ జాఫ్రీ అనే యువకుడు కూడా ఆదివారం సాయంత్రం బైక్ మీద వెళ్తూ.. గుంతలో పడి కాలు విరగొట్టుకున్నాడు.
Samayam Telugu potholes


జాఫ్రి అక్టోబర్‌ 6న రాత్రి 7.30 గంటలకు బైక్‌ మీద నూర్‌ఖాన్‌ బజార్‌ నుంచి బాల్‌షెట్టి ఖేట్‌కు బయల్దేరాడు. రోడ్డ మీద ఉన్న గుంతలో బైక్ దిగబడటంతో.. అతడు బైక్ మీది నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి కుడి కాలు ఫ్రాక్చర్‌ అయ్యింది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు ప్రమాదం జరిగిందని ఆరోపించిన జాఫ్రీ.. నగరపాలక సంస్థపై డబీర్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కాలు విరగడానికి జోనల్ కమిషనర్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. డబీర్‌పురా పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన కాసేపట్లోనే జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి.. ఆ గుంతను పూడ్చేశారు. అదేదో ముందే చేస్తే.. అతడి కాలు విరగకుండా ఉండేది కాదు కదా. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉండటంతో.. నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.