యాప్నగరం

భారీ వర్షాలు.. భద్రాచలం వద్ద భారీగా గోదావరి వరద ఉద్ధృతి

ఎగువన కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 32 అడుగులు దాటింది.

Samayam Telugu 13 Aug 2020, 10:06 am
గోదావరి నదిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. పరివాహాక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఉప నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువన ఉన్న ఇంద్రావతి, తాలిపేరుతోపాటు.. కిన్నెరసాని నుంచి నీటి ప్రవాహం పెరిగింది. భద్రాచలం వద్ద మంగళవారం రాత్రి 25 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం బుధవారం మధ్యాహానికి 29.5 అడుగులకు చేరింది. బుధవారం రాత్రికి గోదావరి నీటిమట్టం 30 అడుగులు దాటింది. గురువారం ఉదయానికి నీటిమట్టం 32 అడుగులకు చేరింది.
Samayam Telugu Godavari


ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటం, క్యాచ్‌మెంట్ ఏరియాల నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. గోదావరి వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. నీటి ప్రవాహం ఇలాగే సాగితే భద్రాచలం వద్ద వరద కొద్ది వ్యవధిలోనే 40 అడుగులకు చేరే ఛాన్స్ ఉంది. దీంతో గోదావరి తీరప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాలిపేరు నుంచి 17,626 క్యూసెక్కులు, కిన్నెరసాని నుంచి 17 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో.. దాని ప్రభావం పోలవరం వద్ద కూడా కనిపిస్తోంది. పోలవరం వద్ద నీటి మట్టం 10.610 మీటర్లకు చేరగా.. కాపర్ డ్యాం వద్ద గోదావరి వరద 24.75 మీటర్లుగా ఉంది. వరద పెరగడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.