యాప్నగరం

ఇంటెలిజెన్స్ వింగ్ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా.. తెలంగాణ పోలీస్ శాఖలో అలజడి

Telangana Police: పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపింది. మంత్రులు, ప్రముఖులకు భద్రత కల్పించే ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌‌లో పని చేసే హెడ్‌ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. పోలీస్ శాఖలో ఇప్పటికే కొంత మంది కరోనా బారినపడ్డారు.

Samayam Telugu 29 Apr 2020, 9:33 am
తెలంగాణ పోలీసు శాఖలో కరోనా కలకలం రేపింది. భద్రతా విభాగంలో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లో పోలీసు సిబ్బందిలో ఇప్పటికే పలువురు కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం (ఏప్రిల్ 28) కొత్తగా 6 కేసులు నమోదయ్యాయి. వీరిలో మంత్రులు, ప్రముఖులకు భద్రత కల్పించే ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ)లో పని చేసే హెడ్‌ కానిస్టేబుల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
Samayam Telugu నమూనా చిత్రం
Hyderabad Police


హైదరాబాద్ నగరంలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరికి కూడా కరోనా సోకినట్లు తెలిసింది. ఖమ్మంలో కరోనా బారినపడ్డ పోలీస్ ఉన్నతాధికారి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. లండన్ నుంచి తిరిగొచ్చిన కుమారుడి నుంచి ఆయనతో పాటు వారింట్లో వంట మనిషి, మరో వ్యక్తికి కరోనా సోకింది. వీరందరూ కోలుకున్నారు.

మంగళవారం నమోదైన కేసులతో తెలంగాణలో కేసుల సంఖ్య 1009కి పెరిగింది. వైరస్‌ బారిన పడినవారిలో మరో 42 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గాంధీ, ఛాతీ, కింగ్‌కోఠి ఆసుపత్రుల్లో కలుపుకొని ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాజిటివ్‌ కేసుల్లో 50 శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉండటం గమనార్హం. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి 25 మంది మృతి చెందారు. వీరిలో కర్ణాటకలోని గుల్బర్బాకు చెందిన ఇద్దరు, ఏపీకి చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నారని మంత్రి ఈటల తెలిపారు.

Also Read: పాప ఫస్ట్ బర్త్‌డే.. పేరెంట్స్ యూఎస్‌లో, సీపీ ఎంట్రీతో మధురంగా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.