యాప్నగరం

BRS: పొరుగు నుంచే బరిలోకి.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్!

Bharat Rashtra Samithi: బీఆర్‌ఎస్ పార్టీకి ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక కేసీఆర్ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉన్నారు. పొరుగు రాష్ట్రం నుంచే బీఆర్‌ఎస్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాలవారీగా పార్టీ తరఫున అధికార ప్రతినిధులను, కో-ఆర్డినేటర్లను నియమించనున్నారు. హిందీ, ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడేవారిని, కేసీఆర్ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే నేతలను ఇందుకోసం ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 8 Dec 2022, 9:15 pm
దేశంలో మార్పు కోసం జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాం అని ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్ (K Chandrashekar Rao) అందుకోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ‘భారత్ రాష్ట్ర సమితి’గా టీఆర్‌ఎస్ పేరు మార్పుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పార్టీ (Bharat Rashtra Samithi) శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు కేసీఆర్. ఈ సంబరాల అనంతరం పార్టీ ముఖ్య నేతలతో జాతీయ రాజకీయాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu Bharat Rashtra Samithi
భారత్ రాష్ట్ర సమితి


ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్.. తెలంగాణ పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచే ‘బీఆర్ఎస్’ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అందులోనూ మొట్టమొదటి సభ మహారాష్ట్రలో (ఆదిలాబాద్ పొరుగు జిల్లాలో) నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత దేశంలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించనున్న ఈ సభకు జాతీయ స్థాయిలో కీలక పార్టీల నేతలు, మద్దతుదారులు, ఇతర ప్రముఖలను ఆహ్వానించే అవకాశం ఉంది.

రైతుల సమస్యలు, సాగునీరు, విద్యుత్తు రంగం, ఎకానమీపై దృష్టి సారించిన కేసీఆర్.. బీఆర్‌ఎస్ ప్రచారంలోనూ వీటినే ప్రధాన అస్త్రాలుగా ఎంచుకోనున్నారు. ఢిల్లీలో సభలోనూ వీటినే ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. రైతు సంఘాల నేతలు, పలు పార్టీల అధినేతలతో కేసీఆర్ ఇప్పటికే సమావేశమయ్యారు. ఇకముందు ఇలాంటి సమావేశాలు మరింత ఎక్కువగా జరుగనున్నాయి. వీటిలో మెజార్టీ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. తెర వెనుక ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక విమానం..
కేసీఆర్ పర్యటనల కోసం పార్టీ తరఫున ప్రత్యేక విమానం కొనుగోలు చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అదే జరిగితే, కొత్త పార్టీగా అవతరించిన వెంటనే.. సొంత విమానం ఉన్న పార్టీగా ‘BRS’ రికార్డు సృష్టించనుంది. కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలందరూ ప్రయాణించేలా, మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇచ్చేలా ఈ విమానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.

జాతీయ రాజకీయాల్లో అనుసరించాల్సిన విధివిధానాలపైనా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. రాష్ట్రాలవారీగా కో-ఆర్డినేటర్లను కూడా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముఖ్యంగా పార్టీ యువనేతల సేవలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. హిందీ, ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడేవారు, కేసీఆర్ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగే నేతలకు రాష్ట్రాలవారీగా పార్టీ అధికార ప్రతినిధులుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కేసీఆర్ టీమ్‌లోని ముఖ్య నేతల్లో ఆయన వెంట జాతీయ రాజకీయాల్లోకి ఎవరెవరు వెళ్తారనేది ఆసక్తిగా మారింది.

మంత్రి కేటీఆర్‌తో ‘బోయింగ్’ బృందం భేటీ.. త్వరలో గుడ్ న్యూస్
Also Read: హైదరాబాద్‌లో అండర్‌గ్రౌండ్ మెట్రో రైలు.. ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ వే

Read Latest Telangana News and Telugu News
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.