యాప్నగరం

సాయంత్రం పదవీ విరమణ సన్మానం.. ఆఫీసులోనే ఆత్మహత్య.. ఉద్యోగి జీవితం విషాదంతం

ఉద్యోగ జీవితంలో చివరి రోజేే ఆయన జీవితంలోనూ చివరి రోజైంది. సాయంత్రం పదవీ విరమణ సన్మానం ఉండగా.. ఉద్యోగానికి వీడ్కోలు చెప్పే తరుణంలో ఆయన ఈ లోకానికే వీడ్కోలు పలికారు.

Samayam Telugu 1 Feb 2020, 10:05 am
ఉద్యోగ జీవితానికి చివరి రోజే ఆయన జీవితంలోనూ ఆఖరి రోజైంది. చివరిసారి డ్యూటీ చేయడం కోసం నైట్ షిప్ట్‌లో వచ్చిన ఓ ఉద్యోగి.. తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉద్యోగానికే కాదు ఈ లోకం నుంచి కూడా శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం ఆయన పదవీ విరమణ సన్మానానికి ఏర్పాట్లు జరగ్గా.. అదే రోజు తెల్లవారుజామున అనూహ్య రీతిలో కార్యాలయంలోనే ఆయన బలవన్మరణానికి పాల్పడటం అందర్నీ కలచివేసింది. ఈ విషాద ఘటన పాల్వంచలోని కేటీపీఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Samayam Telugu suicide


రెడ్డెబోయిన వెంకటేశ్వర్లు కేటీపీఎస్‌ ఐదో దశలో ప్లాంట్‌ అటెండెంట్‌‌గా పని చేసేవారు. గురువారం ఆయన ఉద్యోగ జీవితంలో చివరి రోజు. ఆ రోజు నైట్ డ్యూటీకి వచ్చిన వెంకటేశ్వర్లు.. విధులు ముగించడానికి కొద్ది సమయం ముందు శుక్రవారం తెల్లవారు జామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయనకు సన్మానం చేయాలని అధికారులు భావించారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు.

ఉద్యోగ జీవితంలో చివరి రోజు వెంకటేశ్వరు బలవనర్మణానికి పాల్పడటం అందర్నీ కలచివేసింది. ఉద్యోగ విరమణ తర్వాత జీపీఎఫ్ రాదనే ఆవేదనతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తోటి ఉద్యోగులు వాపోయారు. గత కొద్ది రోజులుగా ఆయన జీపీఎఫ్ విషయమై తమ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడని వారు చెప్పారు. నెలకు రూ.3 వేలు మాత్రమే ఈపీఎఫ్ రానుండటంతో.. ఈ డబ్బుతో జీవితాన్ని వెళ్లదీయడం ఎలా అని ఆందోళన వ్యక్తం చేశాడన్నారు. పదవీ కాలం పొడిగింపుపైనా ఆయన ఆశలు పెట్టుకున్నారు కానీ.. అది కార్యరూపం దాల్చలేదు.

వెంకటేశ్వర్లు బలవన్మరణం కేటీపీఎస్ ఉద్యోగులను కలచివేసింది. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళ చేపట్టారు. మృతదేహాన్ని తరలించకుండా అంబులెన్స్‌కు అడ్డుపడ్డారు. స్పందించిన అధికారులు.. జీపీఎఫ్ మంజూరు చేసే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.

వెంకటేశ్వర్లు మరణంతో ఆయన కుటుంబీకులు షాక్‌కు గురయ్యారు. ఇన్నాళ్లూ కష్టపడ్డ తండ్రి ఇక నుంచి విశ్రాంతి తీసుకుంటాడని భావించిన కూతురు.. తండ్రిని విగతజీవిగా చూసి తట్టుకోలేకపోయిందది. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లయ్యింది, ఆమె అమెరికాలో ఉంటోంది. ఒక్కగానొక్క కుమారుడు కొద్ది నెలల క్రితమే అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి అతడు దిగాలుగా ఉంటున్నాడు. అతడి భార్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొడుకు మరణంతో అనారోగ్యం పాలైన పద్మావతి ఇప్పటికీ కోలుకోలేదు. నెలల వ్యవధిలోనే కొడుకు, భర్త చనిపోవడంతో.. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. రిటైర్మెంట్ తర్వాత తండ్రిని అమెరికా తీసుకెళ్లాలని వెంకటేశ్వర్లు పెద్ద కుమార్తె మాధవి భావించారు. అందుకే ఆమె ఇప్పటికే సొంతూరు వచ్చారు. కానీ ఊహించని రీతిలో తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె హతాశయురాలయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.