యాప్నగరం

మందుబాబులకు గమనిక! ఈ తేదీల్లో లిక్కర్ షాపులు బంద్.. ఎస్ఈసీ ఆదేశాలు

GHMC: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మద్యం తయారీ, రవాణా, నిల్వలు.. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథి అన్నారు.

Samayam Telugu 25 Nov 2020, 8:30 pm
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మైకులు, డప్పు చప్పుళ్లు, నేతల ప్రసంగాలతో వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. అభ్యర్థులు గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు మరింత దగ్గర పడితే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం పంపిణీ కూడా జరుగుతుంటుంది. అందుకే గ్రేటర్ ఎన్నికల వేళ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 29 సాయంత్రం 6 గంటల నుండి డిసెంబరు 1 సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎస్ఈసీ ఉత్తర్వులు వెలువరించింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Liquor sales in Telangana


జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మద్యం తయారీ, రవాణా, నిల్వలు.. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథి అన్నారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన ఎక్సైజ్ శాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, సంయుక్త కమిషనర్ అజయ్, డిప్యూటి కమిషనర్ సయ్యద్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొన్ని సూచనలు చేశారు.

* బెల్టు షాపులు వెంటనే మూసివేయాలి.
* గత సంవత్సరం ప్రస్తుత సమయంలో జరిగిన మద్యం ఉత్పత్తులు, అమ్మకాలతో బేరీజు వేస్తూ పర్యవేక్షించాలి.
* నల్ల బెల్లం, అక్రమ మద్యం ఉత్పత్తికి వాడే ముడి సరకులను సీజ్ చేయాలి.
* అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి చెక్ పోస్టులు ప్రారంభించాలి.
* 29వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబరు 1వ తేది పోలింగ్ ముగిసే వరకు జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం షాపులు మూసి వేయించాలి.
* మద్యం దుకాణాలలో నిల్వలు అనుమతించిన పరిమాణం దాటకుండా చర్యలు తీసుకోవాలి. సమగ్రమైన పర్యవేక్షణ ఎప్పటికప్పుడు జరుపుతూ ఉండాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.