యాప్నగరం

ఆటోను ఢీకొన్న లారీ.. 14 మంది మృతి, మహబూబ్‌నగర్‌లో ఘోర విషాదం

Mahabubnagar | మహబూబ్‌నగర్‌లో రహదారి రక్తం చిందించింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 4 Aug 2019, 8:35 pm
హబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద ఆదివారం (ఆగస్టు 4) రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది కూలీలు వ్యవసాయ పనులు ముగించుకొని ఆటోలో ఇంటికి తిరిగెళ్తుండగా.. లారీ రూపంలో మృత్యువు కబళించింది. మృతుల్లో 10 మందికి పైగా మహిళలే ఉన్నారు.
Samayam Telugu lorry
మహబూబ్‌నగర్ రోడ్డు ప్రమాదం


ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు కన్నుమూశారు. ప్రమాద విషయం గుర్తించగానే స్థానికులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

ప్రమాద సమయంలో ఆటోలో 16 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం నుంచి ఆటో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. బాధితులు కొత్తపల్లి, కొత్తపల్లి పక్కనే ఉన్న గోగ్యా తండా వాసులుగా గుర్తించారు.

ప్రమాదస్థలిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొంత మంది శరీర భాగాలు విడిపోయి రహదారిపై పడటంతో అక్కడ పరిస్థితి భీతావహంగా మారింది. రహదారి రక్తసిక్తమైంది. ఆటోలు నుజ్జనుజ్జయ్యాయి. లారీ అతివేగం, వర్షం కురుస్తుండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

మూల మలుపు.. తరచూ ప్రమాదాలు
ప్రమాదం జరిగిన ప్రాంతంలో మూల మలుపు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించే పరిస్థితి లేదు. ఈ కారణంగా తరచుగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కొత్తపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలిలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వారి ఆందోళనతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.