యాప్నగరం

కరీంనగర్‌లో ఇంటింటికి తాగునీటి పథకం ప్రారంభం.. కేసీఆర్ జలంగా నామకరణం చేసిన మంత్రి

KCR Jalam | కరీంనగర్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఇంటింటికి తాగునీరు అందించేే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి గంగుల కమలాకర్ కేసీఆర్ జలం అని నామకరణం చేశారు.

Samayam Telugu 21 Jul 2020, 12:27 pm
కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఐదు ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరిత హారంలో భాగంగా మొక్కను నాటిన కేటీఆర్.. అనంతరం పట్టణంలో ఇంటింటికి తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును రూ.109 కోట్లతో 2048 వరకు కరీంనగర్ అవసరాలకు సరిపడేలా రూపొందించామన్నారు. భవిష్యత్తులో కరీంనగర్ వాసులకు 24 గంటలూ తాగునీరు అందజేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణలోని మిగతా పట్టణాల్లోనూ కరీంనగర్‌ తరహాలోనే తాగునీరు అందిస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఈ పథకానికి కేసీఆర్ జలం అని నామకరణం చేయడం గమనార్హం.
Samayam Telugu ktr


సీఎం కేసీఆర్ మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే అందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తోన్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. గోదావరి జలాలను కేసీఆర్ బీడు భూములకు మళ్లించారన్నారు. కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను వాయు వేగంతో పూర్తి చేస్తున్నామన్నారు.
భారతదేశానికే తెలంగాణ ధాన్య బాంఢాగారంగా మారిందన్న కేటీఆర్.. సాగునీటి శాఖ పేరును సీఎం కేసీఆర్ జలవనరుల శాఖగా మార్చారని తెలిపారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం కేసీఆర్ విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి సారించారన్నారు.

సాగునీరు, తాగునీరుకు సరిపడేలా కాళేశ్వరం జలాలను మిడ్ మానేర్, లోయర్ మానేరుకు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ పట్టణ ప్రజలకు 80 ఎకరాల్లో లంగ్ స్పేస్ కావాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారని.. దీనికి వెంటనే అంగీకరిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.

‘‘మానేరు మీద నిర్మిస్తోన్న కేబుల్ బ్రిడ్జి 90 శాతం పూర్తయ్యింది. దాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలోనే పూర్తి చేస్తాం. కరీంనగర్‌కు తోరణంలా అలుగునూరు జంక్షన్‌ను తీర్చిదిద్దుదాం. గతంలో రూపాయికే నల్లా కార్యక్రమం ప్రారంభించాం. తెల్లకార్డుదారులకు రూపాయికే నల్లా ఇస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు.

అనంతరం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను మంత్రి ప్రారంభిస్తారు. ‘‘83 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కరీంనగర్‌లో ఐటీ టవర్‌ను నిర్మించాం. స్థానిక విద్యార్థుల్లో నవీన ఆవిష్కరణలకు పెద్దపీట వేద్దాం. కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు అవుతున్న సంస్థలు రూ.15 వేల నుంచి రూ.60 వేలకు జీతాలు ఇవ్వనున్నాయి. కరీంనగర్‌తోపాటు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ టవర్లు ఏర్పాటు అవుతున్నాయి. విదేశాల్లో స్థిరపడిన కరీంనగర్ వాసులు ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే నన్ను లేదా మంత్రి కమలాకర్‌ను సంప్రదిస్తే.. ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇస్తుంది’’ అని కేటీఆర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.