యాప్నగరం

ఆక్టోపస్ పోలీసుల వీరంగం.. మద్యం మత్తులో యువకుడిపై దాడి

ఆక్టోపస్ పోలీసులు ఓ యువకుడిపై అకారణంగా దాడి చేసిన ఘటన హైదరాబాద్ శివార్లలోని బొంగ్లూర్ గేటు సమీపంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Samayam Telugu 22 Aug 2019, 7:34 pm
క్టోపస్‌ పోలీసులు మద్యం మత్తులో వీరంగం సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని మంగళ్‌పల్లిలో ఓ రెస్టారెంట్‌లో మంగళవారం (ఆగస్టు 20) రాత్రి ఓ యువకుడిని చితకబాదారు. అకారణంగా తనను దూర్భాషలాడుతూ కొట్టారని బాధితుడు ఆరోపించాడు. తనతో పాటు తన మిత్రుడి పైనా దాడికి పాల్పడ్డారని పేర్కొన్నాడు. ఈ మేరకు రాము అనే యువకుడు ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Samayam Telugu police


ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆక్టోపస్‌ విభాగానికి చెందిన సుమారు 16 మంది కానిస్టేబుళ్లు మంగళవారం రాత్రి 11.20 గంటల సమయంలో భోజనం చేయడానికి బొంగులూర్ గేట్ సమీపంలోని మన రుచులు రెస్టారెంట్‌కు వచ్చారు. అదే సమయంలో ఓ టేబుల్‌పై రాము అనే వ్యక్తి భోజనం చేస్తున్నాడు. మద్యం తాగి ఉన్న కొంత మంది పోలీస్ కానిస్టేబుళ్లు అకారణంగా తనను వేధించారని అతడు పేర్కొన్నాడు.

తనను ఎందుకు వేధిస్తున్నారని యువకుడు ప్రశ్నించగా.. తమనే ప్రశ్నిస్తావా అంటూ ఆగ్రహోక్తులై విచక్షణా రహితంగా దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. తనపై దాడి చేస్తుండగా అడ్డుకునే యత్నం చేసిన తన మిత్రుడు కృష్ణను కూడా కొట్టారని తెలిపాడు.

తాము పోలీసులమని.. ఏం చేసుకుంటారో చేసుకోండని హెచ్చరించినట్లు బాధితుడు ఆరోపించాడు. రాత్రి 11.30 గంటల నుంచి 12 గంటల వరకు తమపై దాడి చేశారని తెలిపాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.