యాప్నగరం

ఆర్టీసీ జేఏసీకి షాక్.. దీక్షలకు అనుమతులు నిరాకరించిన పోలీసులు

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కార్మికులు వస్తే అరెస్టులు తప్పవు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున నిరసనలు, దీక్షలకు అనుమతులు నిరాకరించినట్లు పోలీసు శాఖ స్పష్టం చేసింది.

Samayam Telugu 6 Oct 2019, 10:59 pm
టీఎస్ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టేశారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఉద్యోగాల్లో చేరని వారిని ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించేది లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే సీఎం నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని దుయ్యబడుతున్నారు.
Samayam Telugu police


ప్రభుత్వం నిర్ణయం అప్రజాస్వామికమని, చట్టవిరుద్ధమని జేఏసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ప్రకటించింది. రేపు ధర్నా చౌక్ వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేయనున్నట్లు వెల్లడించింది. జేఏసీ నేతలు దీక్షలకు సిద్ధమవుతున్న వేళ పోలీసు శాఖ షాకిచ్చింది. నిరాహార దీక్షలకు అనుమతులు నిరాకరించింది. కార్మికులు ధర్నా చౌక్ వద్దకు వస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించింది.

Also Read: ప్రభుత్వ బెదిరింపులకు భయపడం.. దీటుగా జవాబిచ్చిన ఆర్టీసీ జేఏసీ

ఇందిరా పార్క్ వద్ద ఆంక్షలు అమల్లో ఉన్నాయని, దీక్షలకు అనుమతులు లేవని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున దీక్షలకు అనుమతులు నిరాకరించినట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ధర్నా చౌక్‌కు వస్తే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, ముందు జాగ్రత్త చర్యగా నిరసనలకు అనుమతులు నిరాకరించినట్లు చెప్పారు.

టీఎస్‌ఆర్టీసీ కార్మికులు శుక్రవారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి కార్మికుల సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేదంటూ సమ్మె బాట పట్టారు. గతంలో ప్రభుత్వం వేసిన కమిటీ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదని.. ఆర్టీసీని బతికించడానికే తమ పోరాటం అని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.