యాప్నగరం

అవినీతికి దూరంగా ఉంటాం.. ఎమ్మెల్యే సమక్షంలో ఉద్యోగులు ప్రతిజ్ఞ!

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇస్తే కానీ ఏ పని జరగడంలేదు. కొందరు లంచాలు తీసుకున్నా పనిచేస్తారనే నమ్మకం కూడా ఉండదు. దీనిపై సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారంటే రెవెన్యూ శాఖలో అవినీతి ఎంతలా వేళ్లూనుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

Samayam Telugu 22 Nov 2019, 9:41 am
రెవెన్యూ శాఖలో పని జరగాలంటే ఆమ్యామ్యాలు ముట్టజెప్పాల్సిందే అంటూ బాహాటంగానే చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ హెచ్చరికలను కూడా బేఖాతారు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని వాదన వినబడుతోంది. అమాయక ప్రజలు పీడిస్తూ, దొరికినంత దోచుకో అన్న చందంగా రెవిన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి పైవరకు అక్రమాలు వ్యవస్థీకృతంగా మారాయి. పహాణీకి రూ.వెయ్యి, ధ్రువపత్రాల జారీకి రూ.2 వేల నుంచి రూ.3 వేలు, భూముల ధరలు బాగా ఉన్న చోట ఎకరానికి రూ.10 వేలు విదిలిస్తే తప్ప వారసత్వ బదిలీ పని పూర్తికాదు. ఇదీ రెవెన్యూ శాఖలో నిరంతరాయంగా సాగుతున్న తంతు. అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడుల్లో పట్టుబడుతున్న అనేక ఉదంతాలే ఇందుకు నిదర్శనం. తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు ఇదే కారణమని ప్రచారం జరిగింది.
Samayam Telugu trs


ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్ పరిధిలోని నేరేడుచర్ల ఎమ్మార్వో ఆఫీసు పరిధిలోని రెవెన్యూ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అవినీతికి పాల్పడబోమంటూ స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలోనే ప్రతిజ్ఞ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో తహసీల్దార్‌ రాంరెడ్డి ఈ ప్రతిజ్ఞ చేయించారు. రోజూ 3 గంటల నుంచి 5 గంటల వరకు రైతుల భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే రైతులు నేరుగా తననే సంప్రదించాలని, నిబంధనల మేరకు ఇసుక అనుమతులు ఇస్తామని ఎమ్మార్వో పేర్కొన్నారు. తహసీల్దార్ ఆఫీసులో మధ్యవర్తుల ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.

ఎలక్ట్రిసిటీ సర్కిల్ ఆఫీసులో కమర్షియల్ ఏడీఈగా పనిచేస్తున్న పోడేటి అశోక్ ‘నేను లంచం తీసుకోను’ అంటూ పెద్ద అక్షరాలతో తన కార్యాలయంలో బోర్డు రాయించి పెట్టడం చర్చనీయాంశమైంది. తాను లంచం తీసుకోనని తన కార్యాలయంలో బోర్డు పెట్టించారు. అందరూ నిజాయతీగా పనిచేస్తే అవినీతి రహిత వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.