యాప్నగరం

సీనియర్ జర్నలిస్ట్, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూత

విలువలు, నిబద్దతతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచి తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన పాత్రికేయులు చక్రవర్తుల రాఘవాచారి. నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు చేశారు.

Samayam Telugu 28 Oct 2019, 9:55 am
ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ జర్నలిస్ట్, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి (81) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నిబద్దత కలిగి, విలువలకు జీవితాంతం కట్టుబడిన కమ్యూనిస్టుగా విజ్ఞానఖనిగా రాఘవాచారి పేరు గాంచారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. 30 ఏళ్ల పాటు విశాలాంధ్ర సంపాదకులుగా బాధ్యతలు నిర్వర్తించిన రాఘవాచారి.. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా సేవలందించారు.
Samayam Telugu Raghava


1972లో విశాలాంధ్ర ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాఘవాచారి 2005 వరకు కొనసాగారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్‌ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10న ఆయన జన్మించారు. నిబద్ధతత, విలువలతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచారు. చక్రవర్తుల రాఘవాచారి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్‌, కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ సంతాపం తెలిపారు. విలువలతో కూడిన జర్నలిజాన్ని ఆయన విశ్వసించారని, యువ తరాలకు రాఘవాచారి ప్రేరణగా నిలిచారని జగన్ కొనియాడారు.

విశాలాంధ్ర మాజీ సంపాదకులుగా ఆయన సేవలు చిరస్మరణీయమని, నమ్మిన సిద్ధాంతం కోసం రాఘవాచారి జీవితాంతం కట్టుబడి ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నిరుపేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన పని చేశారని చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. పూర్తి నిబద్దతతో తన వృత్తిలో రాణించారని.. సమకాలీన పాత్రికేయులకు ఆదర్శంగా, భావి తరాలకు మార్గదర్శంగా నిలిచారన్నారు.

రాఘవాచారి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన జర్నలిస్ట్‌గా, విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా ఆయన సాగించిన జీవితం ఆదర్శప్రాయం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, సహచరులకు కేసీఆర్ సానుభూతి తెలిపారు. రాఘవాచారి భౌతికకాయాన్ని మగ్దూం భవన్‌కు తరలించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడ విశాలాంధ్ర కార్యాలయానికి తరలిస్తారు. నేటి సాయంత్రం విజయవాడ విశాలాంధ్ర కార్యాలయం నుంచి అంతిమ యాత్ర నిర్వహిస్తున్నట్టు సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.