యాప్నగరం

సోనియా నాకు తల్లి లాగా.. ఆమె ఆశీస్సులతోనే బీజేపీలో చేరుతున్నా: సర్వే

Telangana BJP: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీని ఒప్పించింది తానేనని సర్వే సత్యనారాయణ అన్నారు.

Samayam Telugu 21 Nov 2020, 6:41 pm
జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్లు శుక్రవారమే ప్రకటించారు. తాజాగా ఆయన తాను పార్టీ మారుతుండడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశీస్సులతోనే బీజేపీలో వెళ్తున్నానని అన్నారు. టీఆర్ఎస్ కోవర్టుల వల్లే కాంగ్రెస్ పతనమైందని మండిపడ్డారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించింది కేసీఆరేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నాయకత్వమే కాంగ్రెస్ నాశనానికి కారణమని అభిప్రాయపడ్డారు. తనలాంటి నేతలను వారు గౌరవించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
Samayam Telugu సర్వే సత్యనారాయణ
sarve satyanarayana


తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీని ఒప్పించింది తానేనని సర్వే సత్యనారాయణ అన్నారు. సోనియా గాంధీ తనకు తల్లిలాంటిదని రాహుల్ గాంధీ తమ్ముడని అన్నారు. సోనియా ఆరోగ్యం క్షీణించిందని, రాహుల్‌కు రాజకీయాలపై ఆసక్తి లేదని అందుకే తాను మరోదారి చూసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. దేశంలో మరో 20 ఏళ్లు బీజేపీదే అధికారమని చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా సర్వే సత్యనారాయణ కూడా బీజేపీలోకి వెళ్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగినా ఆయన దానిని ఖండించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.