యాప్నగరం

కిషన్ రెడ్డికి ముందు రోజే ఫోన్ చేశాం.. అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: తలసాని

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు.

Samayam Telugu 16 Feb 2020, 12:39 am
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభం విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కిషన్‌ రెడ్డిని ఆహ్వానించామని.. ఈ విషయంపై ఆయన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో స్థిరపడేవాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు.
Samayam Telugu talasani


ఆదర్శ్‌ నగర్‌ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శనివారం (ఫిబ్రవరి 15) మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. మెట్రో రైలు ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీజేపీ నేతలు చేస్తు్న్న విమర్శలపై మండిపడ్డారు. ‘మెట్రో రైలు ప్రారంభోత్సవానికి మేం ప్రోటోకాల్‌ పాటించాం. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి ముందు రోజే ఫోన్‌ చేసి చెప్పాం. తనకు పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నాయని ఆయన బదులిచ్చారు. సమావేశాలు అయిపోయిన తర్వాత సాయంత్రం వరకైనా రావాలని చెప్పాం’ అని తలసాని వివరించారు.

మొదటి కారిడార్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించిన విషయాన్ని మంత్రి తలసాని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతేడాది మూడో కారిడార్‌ను నాటి గవర్నర్ నరసింహన్ ప్రారంభించారని చెప్పారు. మెట్రో ప్రారంభోత్సవం తమ పార్టీ కార్యక్రమం కాదని.. ప్రోటోకాల్‌ విషయంలో ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని తలసాని స్పష్టం చేశారు. ప్రజల క్షేమం కాంక్షించి బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు.

హైదరాబాద్‌ మెట్రో ప్రపంచంలోనే అతి పెద్దదని మంత్రి తలసాని చెప్పారు. ప్రభుత్వ - ప్రైవేట్‌ భాగస్వామ్యంతో హైదరాబాద్‌ మెట్రో రూపుదిద్దుకుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేయించారని తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తారో చెప్పాలని మంత్రి కిషన్ రెడ్డిని తలసాని డిమాండ్ చేశారు. చెబితే ఆయన గౌరవమే పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌ నగరానికి మణిహారంగా పేర్కొంటున్న మెట్రో రైలులో కీలకమైన జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 7న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రొటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించాల్సి ఉండగా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మెట్రో రైలు ప్రారంభించిన రోజే కిషన్ రెడ్డి కార్యాలయ అధికారులు మెట్రో అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.