యాప్నగరం

కోడెల ఆత్మహత్య.. చివరి 2 గంటల్లో ఏం జరిగింది?

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద రావు బలవన్మరణం ప్రజలను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఆయన మరణించడానికి కొద్ది గంటల ముందు ఏం జరిగింది?

Samayam Telugu 16 Sep 2019, 5:00 pm
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు సోమవారం ఆకస్మిక మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్‌కు గురిచేసింది. సోమవారం (సెప్టెంబర్ 16) ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆయన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కోడెల మరణానికి రెండు గంటల ముందు చోటు చేసుకున్న పరిణామాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu death


కోడెల సోమవారం ఉదయం 10 గంటల సమయంలో తన భార్యతో కలిసి టిఫిన్ చేశారు. 10.15 నిమిషాలకు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. గది లోపల నుంచి లాక్ చేసుకున్నారు. కాసేపటి తర్వాత కోడెల డోర్ లాక్ చేసుకున్నట్లు ఆయన భార్య గుర్తించారు.

తలుపులు తెరవాలంటూ అరిచినా.. లోపల నుంచి సమాధానం లేకపోవడంతో కోడెల సతీమణి.. గన్‌మెన్‌ను పిలిచారు. వెనుక డోర్ బద్దలు కొట్టి గన్‌మెన్ గది లోపలకి ప్రవేశించాడు. కోడెల అప్పటికే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్నారు. 10 గంటల 40 నిమిషాలకు కోడెలను ఆయన భార్య, గన్‌మెన్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తరలించారు.

10 గంటల 50 నిమిషాలకు బసవతారకం వైద్యులు కోడెలను పరిశీలించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు వెంటనే చికిత్స ప్రారంభించారు. 11 గంటల తర్వాత క్యాన్సర్ ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్ సీఐ కళింగరావు ఆదేశాలతో ఎస్సై రాంరెడ్డి ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. కాసేపటికి ఆస్పత్రికి ఏసీపీ చేరుకున్నారు.

12.39 గంటలకు కోడెల తుదిశ్వాస విడిచినట్లు బసవతారకం ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల కోడెల మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

ఆత్మహత్య కారణాలపై పోలీసులు అరా తీస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ అభించలేదని పోలీసులు చెబుతున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దింపి కేసు పరిశీలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.