యాప్నగరం

దేశం మారుతోంది, మార్పు తథ్యం.. 2, 3 నెలల్లో సంచలన వార్త వింటారు: కేసీఆర్

KCR in Bengaluru: జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కర్ణాటక రాజధాని బెంగళూరులో జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలపై కీలక చర్చ జరిపారు. దేశంలో మార్పు తథ్యమని కేసీఆర్ అన్నారు. రెండు, మూడు నెలల్లో సెన్సేషనల్ వార్త వింటారని ఆయన అన్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 26 May 2022, 6:08 pm
దేశం మారుతోందని, మార్పు తథ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారని చెప్పారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం (మే 26) మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామితో కేసీఆర్ భేటీ అయ్యారు. దేశ రాజకీయాల గురించి చర్చించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో కేసీఆర్ మాట్లాడారు.
Samayam Telugu బెంగళూరులో కేసీఆర్
CM KCR discussing national politics with HD Deve Gowda and Kumaraswamy in Bengaluru


మాటలు చాలా చెబుతున్నారు గానీ, అసలు వాస్తవాలను గణాంకాలే చెబుతున్నాయంటూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఎన్నడూ లేనంతగా ధరలు పెరుగుతున్నాయని, ద్రవ్యోల్బణం పెరుగుతోందని గర్తుచేశారు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా క్షీణించిందని అన్నారు. దేశ ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో మార్పు వస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

‘చైనా జీడీపీ ఒకప్పుడు మనకంటే చాలా తక్కువ. నేడు 16 మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అది అవతరించింది. భారత్ 5 మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెబుతున్నారు. కానీ, ఇప్పుడప్పుడే అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఇంతకంటే పెద్ద అవమానం మరొకటి ఉండదు. అమెరికా కంటే కూడా పెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యేందుకు భారత్‌కు అవకాశం ఉంది. మనకు యువశక్తి ఉంది. అపారమైన వనరులు ఉన్నాయి. ఇక్కడ అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి’ అని కేసీఆర్ అన్నారు.

ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనేది ఇప్పుడు ప్రశ్న కాదని కేసీఆర్ అన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా దేశం స్థితి అక్కడే ఉందని.. దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో రైతులు, ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరని,
పారిశ్రామిక వృద్ధి తగినంతగా లేదని కేసీఆర్ అన్నారు.

CM KCR press meet in Bengaluru


‘దేశం అమృత్ మహోత్సవాలను జరుపుకొంటున్న వేళ.. పవర్ (శక్తి) కోసం, తాగునీటి కోసం, సాగునీటి కోసం జనం తిప్పలు పడుతున్నారు. ఏంటీ ఈ పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం కావొచ్చు, బీజేపీ కావొచ్చు.. ఎవరు అధికారంలో ఉన్నా చేయాల్సినంత చేయలేదు’ అని కేసీఆర్ అన్నారు.

‘జాతీయ స్థాయిలో మార్పు జరుగబోతోంది. దాన్ని ఎవరు ఆపాలని ప్రయత్నించినా ఆపలేరు. భారత్ పరివర్తన చెందుతోంది. చెందాలి కూడా. వైరుధ్యాలను, సిద్ధాంతాలను, అన్ని రకాల ఇజాలను పక్కనపెట్టి మార్పు కోసం అందరూ కలిసికట్టుగా ప్రయత్నించాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

‘ఉజ్వల హిందూస్థాన్ కోసం కృషి చేయాలి. సెన్సేషన్, సెన్సేషనల్ వార్తల గురించి ప్రయాస వదిలిపెట్టి దేశాన్ని సరైన దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలి’ అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.