యాప్నగరం

తెలంగాణపై తీవ్ర వివక్ష.. లెక్కలతో వివరించిన కేసీఆర్

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సీఎం కేసీఆర్ లెక్కలతో పాటు వివరించారు. మోదీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. పన్నుల్లో వాటా తగ్గించడడం ప్రభుత్వ అసమర్థతే అని మండిపడ్డారు.

Samayam Telugu 1 Feb 2020, 10:13 pm
కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై సీఎం కేసీఆర్ శనివారం (ఫిబ్రవరి 1) సాయంత్రం ప్రగతి భవన్‌లో 4 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Samayam Telugu Kcr2


బడ్జెట్‌పై కేసీఆర్ వ్యక్తం చేసిన కీలక అభిప్రాయాలు
* కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు. తెలంగాణ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాల్సి ఉంది. గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందిస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. కానీ, సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు కుదించారు. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గాయి. కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు వస్తాయనే ఉద్దేశంతో రాష్ట్రం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక కేంద్రం నిధుల్లో కోత విధించడం వల్ల తారుమారైంది.

* కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించడం కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థత మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసి, రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సి ఉంది. ప్రతి సందర్భంలోనూ బడ్జెట్లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. ఒకటీ అరా శాతం అటూ ఇటు అయిన సందర్భాలున్నాయి. కానీ, 2019-20 సంవత్సరంలో ఏకంగా 18.9 శాతం తగ్గుదల రావడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహరాల నిర్వహణలో లోపానికి నిదర్శనం. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై తీవ్రంగా పడింది.

* 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధుల్లో రెండు రకాల నష్టం వాటిల్లింది. ఒకటి.. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది. రెండు.. తెలంగాణ రాష్ట్రానికి గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను 2.133 శాతానికి తగ్గించారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటాగా రావాల్సిన నిధుల్లో రూ.2,381 కోట్ల రూపాయలు తగ్గనున్నాయి. ఇంత భారీగా తెలంగాణకు నిధులు తగ్గించడం కచ్చితంగా వివక్షే.

* 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఇస్తామని పార్లమెంటులో ప్రకటించిన వాటాలో రూ.3,731 కోట్లు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,726 కోట్లు ఇస్తామని ప్రతిపాదిస్తోంది. ఈసారి కూడా అంచనాలు సవరించే నాటికి చెప్పిన దాంట్లో ఎంత తగ్గిస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండాపోతోంది. కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడింది.

* జీఎస్టీ విషయంలోనూ కేంద్రం పెద్ద మోసం, దగా చేస్తోంది. 14 శాతం లోపు ఆదాయ వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేళ్ల పాటు భర్తీ చేస్తామని 2017లో తెచ్చిన జీఎస్టీ చట్టంలో చెప్పారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా ఇంకా రూ.1,137 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఈ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు.

* కేంద్ర బడ్జెట్లో పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో భారీ కోత పెట్టారు. దీనివల్ల శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుంది. తెలంగాణలోని పట్టణాల అభివృద్ధికి 2019-20 బడ్జెట్లో రూ.1,037 కోట్లు కేటాయించాం. 2020-21 బడ్జెట్ వచ్చే సరికి గత ఏడాది కంటే 148 కోట్ల రూపాయలు తగ్గించి, కేవలం 889 కోట్లు మాత్రమే కేటాయించారు. పట్టణాభివృద్దికి ఇచ్చే నిధుల్లో 14.3 శాతం కోత పెట్టారు.

* మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల సహాయం తెలంగాణ రాష్ట్రానికి అందివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులు అమలు చేయాలని కేంద్రానికి అనేక సార్లు విన్నవించాం. అయినా వారు పట్టించుకోలేదు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా దాని ఊసులేదు.

* తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో ప్రాజెక్టులు నిర్మించాం. దాని నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర సహకారం కావాలని అభ్యర్థించాం. కానీ, కేంద్రం నిధులు కేటాయించలేదు.

కేటాయింపుల్లో కోత ఇలా..
* వ్యవసాయ రంగానికి 2019-20 సంవత్సరంలో 3.65 శాతం మేర నిధులు కేటాయించగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.39 శాతం మాత్రమే నిధులు కేటాయించారు.
* వైద్య ఆరోగ్య రంగానికి గత ఏడాది 2.24 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 2.13 శాతం నిధులు మాత్రమే కేటాయించారు.
* గ్రామీణాభివృద్ధికి గత ఏడాది 4.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.94 శాతం మాత్రమే నిధులు కేటాయించారు.
* విద్యా రంగానికి గత ఏడాది 3.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.22 శాతం నిధులు మాత్రమే కేటాయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.