యాప్నగరం

యురేనియం తవ్వకాలపై అట్టుడికిన నల్లమల, కాంగ్రెస్ నేతల అరెస్టు.. స్తంభించిన శ్రీశైలం హైవే

Nallamala: యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమల అటవీ ప్రాంతం అట్టుడికింది. బంద్‌ పిలుపు అందుకొని నాగర్‌ కర్నూల్ జిల్లా అచ్చంపేట వాసులు శ్రీశైలం రహదారిపై బైఠాయించారు.

Samayam Telugu 9 Sep 2019, 7:31 pm
ల్లమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. నాగర్‌ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రజలు సోమవారం (సెప్టెంబర్ 9) నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ బంద్‌కు విద్యా సంస్థలు, వ్యాపారస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మద్దతు తెలిపారు. నిరసనకారులు ర్యాలీగా వెళ్లి శ్రీశైలం, హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Samayam Telugu Nallamala


నిరసన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఆందోళనకారులను పక్కకు లాక్కెళ్లి రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. మరోవైపు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ భారీ ఎత్తున నిరసన చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

నల్లమలలో యురేనియం తవ్వకాలు వద్దు: పవన్ కళ్యాణ్
యురేనియం తవ్వకాల అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు (వీహెచ్‌) జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. నల్లమలలో యురేనియం తవ్వకాలు వద్దే వద్దని డిమాండ్ చేశారు. ఈ అంశంపై అఖిలపక్షంతో చర్చించి ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాలకూ నష్టమే..
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి నష్టం చేకూరుతుందని.. జీవవైవిధ్యం నాశనమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలతో కృష్ణా జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని.. అదే జరిగితే ప్రజలు క్యాన్సర్‌, మూత్రపిండ వ్యాధుల బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నల్లమలలో యురేనియం తవ్వకాలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు ఉంటుందని నేతలు చెబుతున్నారు. నల్లమలలో జీవవైవిధ్యం దెబ్బతిని వేలాది సంఖ్యలో జంతువులు మృత్యువాత పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.