యాప్నగరం

ఆఖరి నిమిషంలో గవర్నర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్.. ఏం జరగబోతోంది?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు. పార్లమెంట్‌లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. అయితే అదే సమయంలో ఢిల్లీ నుంచి గవర్నర్‌ తమిళిసైకి పిలుపురావడం ఆసక్తికరంగా మారింది. రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ ఖరారైనట్లు సమాచారం వచ్చినప్పటికీ చివరి నిమిషంలో రద్దవడం గమనార్హం.

Samayam Telugu 5 Apr 2022, 3:38 pm
తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కేంద్ర హోం శాఖ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీకి బయలుదేరారు. సోమవారం రాత్రి ఇండిగో విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగినా చివరి నిమిషంలో పర్యటన రద్దయింది. రేపు ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షాతో భేటీ కానున్నట్లు సమాచారం వచ్చినప్పటికీ ఆఖరి నిమిషంలో టూర్ రద్దు అయినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాచారంతో గవర్నర్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసి ధాన్యం కొనుగోళ్లపై ఒత్తిడి తెచ్చేలా వ్యూహ రచన చేస్తున్నారు. అదే సమయంలో కేంద్రం నుంచి గవర్నర్‌కి పిలుపు రావడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. కానీ అంతలోనే గవర్నర్ పర్యటన రద్దయింది.
Samayam Telugu tamilisai


ఇటీవల రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరిగిపోయింది. రెండు రోజుల కిందట రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకల సందర్భంగా ఆ విషయం తేలిపోయింది. తాను ఎవరికీ భయపడనని.. రాజ్‌భవన్ లిమిటేషన్స్ తనకు తెలుసంటూ గవర్నర్ హాట్ కామెంట్స్ చేశారు. తాను శక్తివంతురాలినని.. తననెవరూ నియంత్రించలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యాఖ్యలు సీఎం కేసీఆ‌ర్‌ని ఉద్దేశించినవేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొద్దికాలంగా రాష్ట్రంలో గవర్నర్ ప్రొటోకాల్ వ్యవహారం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర ప్రథమ పౌరురాలు అయిన గవర్నర్‌కి అధికారికంగా ప్రొటోకాల్ పాటించకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం గవర్నర్ పర్యటనలకు హాజరుకాకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడం.. సమ్మక్క సారక్క జాతరకు వెళ్తే కనీసం ఒక్క మంత్రి కూడా అధికారికంగా స్వాగతం పలకకపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార యంత్రాంగం, మంత్రులు, ప్రజాప్రతినిధులు కనీసం ప్రొటోకాల్ మర్యాదలు పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి.

తాజాగా ఉగాది పండుగ అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వెళ్తే కనీసం ఈవో కూడా హాజరుకాకపోవడం మరో వివాదానికి దారితీసింది. కరోనా సమయంలో నేరుగా నిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్.. అక్కడి పరిస్థితి తెలిసేలా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం వివాదం రాజేసింది. అనంతరం హుజూరాబాద్ ఎన్నికల వేళ పార్టీ ఫిరాయించి గులాబీ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని రాజ్‌భవన్ పెండింగ్‌లో పెట్టింది. ఆయన చేసిన సమాజ సేవపై వివరాలు సేకరిస్తున్నామంటూ గవర్నర్ కార్యాలయం చెప్పడం మరింత దుమారానికి దారితీసింది. ఇలా వరుస పరిణామాలతో రాజ్‌భవన్, ప్రగతి భవన్ నడుమ దూరం పెరుగుతూ వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.