యాప్నగరం

స్కూళ్ల రీఓపెన్: వీళ్లకి డైరెక్ట్ క్లాసుల్లేవ్, ఈ స్టూడెంట్స్‌కి షిఫ్టుల్లో క్లాస్‌లు.. గైడ్‌లైన్స్ ఇవే..

Hyderabad: తొమ్మిదో తరగతి నుంచి ఆపై తరగతులు అంటే.. పది, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు ఈ మార్గదర్శకాలు వర్తించనున్నాయి. ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ తరగతులూ కొనసాగించవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

Samayam Telugu 12 Jan 2021, 10:49 pm
ఫిబ్రవరి 1న విద్యా సంస్థలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన వేళ.. అందుకు అనుగుణంగా తెలంగాణ విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. తొమ్మిదో తరగతి నుంచి ఆపై తరగతులు అంటే.. పది, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు ఈ మార్గదర్శకాలు వర్తించనున్నాయి. ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ తరగతులూ కొనసాగించవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు కనీస హాజరు శాతం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. అయితే విద్యార్థుల హాజరు విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మార్గదర్శకాల్లో తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Governmment School Telangana


ఇక ఇంటర్మీడియట్‌ పరీక్షల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని.. ఈ ఏడాది పరీక్షల్లో మరిన్ని ఛాయిస్‌లు ఇవ్వాలని భావిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ని తర్వాత విడుదల చేస్తామని పేర్కొంది. ఫిబ్రవరి 1న విద్యా సంస్థలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన వేళ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్, సాంకేతిక, కళాశాల విద్యాశాఖల కమిషనర్ ననీన్ మిట్టల్, ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. స్కూళ్లు, కాలేజీల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆమె ఆదేశించారు.

మార్గదర్శకాలివీ..
* ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించకూడదు.
* 8 వ తరగతి వరకు డిటెన్షన్ విధానం ఉండదు.
* పదో తరగతి పరీక్షలు షెడ్యూలు తర్వాత విడుదల చేస్తాం.
* జూనియర్ కళాశాలల్లో 300కి పైగా విద్యార్థులుంటే షిఫ్టు విధానం అమలు చేయాలి.
* 300లోపు విద్యార్థులున్న కళాశాలల్లో ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు తరగతులు నిర్వహించవచ్చు.
* ఉదయం 8.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం తరగతులు.. మధ్యాహ్నం 1.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించాలి.
* డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కళాశాలల్లో రొటేషన్‌ విధానంలో రోజుకు సగం మంది విద్యార్థులకే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలి.
* డిగ్రీ, పీజీ, వృత్తివిద్య కోర్సుల్లో ఈ సెమిస్టర్ కనీస హాజరు తప్పనిసరిగా ఉండబోదు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.