యాప్నగరం

కరోనా కట్టడి చర్యలు.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కరోనా కట్టడి విషయంలో ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడిన హైకోర్టు గురువారం నాటి విచారణ సందర్భంగా ప్రశంసలు గుప్పించింది.

Samayam Telugu 13 Aug 2020, 2:49 pm
కరోనా వైరస్‌ను అరికట్టే విషయమై తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగానికి హైకోర్టు కితాబిచ్చింది. రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రీట్మెంట్ విషయమై గురువారం విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు జరుపుతున్న తీరు, పాజిటివ్ వచ్చిన వారికి అందిస్తోన్న చికిత్స గురించి ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది.
Samayam Telugu Telangana high court
Telangana high court


ఆగస్టు 3 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 42 వేల మంది సెంకడరీ కాంటాక్టులకు కరోనా టెస్టులు చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం ప్రభుత్వ యంత్రాంగానికి కితాబిచ్చింది. గతంలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేయడంపై స్పందిస్తూ.. దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడం కోసమే తాము ప్రయత్నించామని, అంతేగానీ విమర్శలు చేయాలనేది తమ ఉద్దేశం కాదని న్యాయస్థానం తెలిపింది.

చిన్న చిన్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశామని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా యోధులు తమ వ్యాఖ్యాలను అపార్థం చేసుకోవద్దని సూచించింది. కరోనాపై పోరాడుతున్న అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని తెలిపింది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే ఉద్దేశంతోనే సూచనలు చేశామని స్పష్టం చేసింది.

మరోవైపు ప్రయివేట్ హాస్పిటళ్లు కరోనా చికిత్స కోసం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ హాస్పిటళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.