యాప్నగరం

రైతుబంధు పథకంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

రైతుబంధు పథకం అమలు తీరుపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వంతోపాటు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు నోటీసులు జారీ చేసింది.

Samayam Telugu 28 Aug 2019, 6:46 pm
తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మరో నోటీస్ జారీ చేసింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటీషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. తాజాగా రైతుబంధు పథకంపై నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం అమలు తీరు సరిగా లేదంటూ రిటైర్డ్ డీఎస్పీ రాఘవరెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.
Samayam Telugu HIGHCOURTHYDERABAD


మొదటి విడతలో తనకు రైతు బంధు నిధులు మంజూరు చేశారనీ, రెండు, మూడు విడతలకు సంబంధించిన నిధులు ఇప్పటికీ రాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చట్టబద్ధంగా తనకు రావాల్సిన నిధులు వెంటనే మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కోరారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వంతోపాటు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో తమ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ప్రశంసలతోపాటు విమర్శలు..
రైతులకు పెట్టుబడి సాయం కింద కొంత మొత్తాన్ని అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా మొదట ఎకరానికి సంవత్సరానికి రూ. 8000 చొప్పున అందజేసింది. గత ఎన్నికల హామీల్లో భాగంగా ఆ మొత్తాన్ని రూ. 10 వేలకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు.

అయితే మొదట రైతుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ పథకం తర్వాత విమర్శలు కూడా మూట గట్టుకుంది. దీని ద్వారా వందల ఎకరాలు ఉన్న భూస్వాములే లాభపడుతున్నారంటూ చిన్నకారు రైతులు ఆరోపించారు. పైగా, సాగేతర భూములకు కూడా చెల్లించడం వల్ల, వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందంటూ విమర్శించారు. దీంతోపాటు ఇటీవల చాలామంది రైతులు సకాలంలో రైతుబంధు చెక్కులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.