యాప్నగరం

గద్దెపైకి పగిడిద్దరాజు.. సారలమ్మ ఆగమనం నేడు..

Medaram: బుధవారం ఉదయాన్నే తిరిగి నడక ప్రారంభించి రాత్రికి మేడారంలో సమ్మక్క కుమార్తె సారలమ్మ సరిగ్గా గద్దెకు చేరే సమయానికి పగిడిద్దరాజును గద్దె పైకి తీసుకెళ్తారు. బుధవారం రాత్రి తన గద్దెపై పగిడిద్దరాజు కొలువుదీరతాడు.

Samayam Telugu 5 Feb 2020, 5:15 pm
సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమైంది. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఈ వన జాతర భక్తి శ్రద్ధలతో సాగనుంది. మహాజాతరలో తొలి ఘట్టం మంగళవారమే మహబూబాబాద్‌ జిల్లా పూనుగొండ్లలో ప్రారంభమైంది. పూనుగొండ్లలో కొలువై ఉన్న సమ్మక్క భర్త, పడగ రూపంలో ఉండే పగిడిద్దరాజును పూజారులు పెళ్లి కొడుకుగా అలంకరించి, గిరిజన సంప్రదాయాలు, డోలువాయిద్యాలతో ఊరేగింపుగా మేడారానికి కాలినడకన తీసుకువస్తారు. పూనుగొండ్ల-మేడారం మధ్య 66 కిలో మీటర్ల దూరం.. వీరు కాలినడకన అటవీ మార్గం ద్వారానే చేరుకుంటారు. మంగళవారం రాత్రి వీరు గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో బస చేశారు.
Samayam Telugu Medaram1 (3)


బుధవారం ఉదయాన్నే తిరిగి నడక ప్రారంభించి రాత్రికి మేడారంలో సమ్మక్క కుమార్తె సారలమ్మ సరిగ్గా గద్దెకు చేరే సమయానికి పగిడిద్దరాజును గద్దె పైకి తీసుకెళ్తారు. బుధవారం రాత్రి తన గద్దెపై పగిడిద్దరాజు కొలువుదీరతాడు. సమ్మక్క, పగిడిద్దరాజుల కుమారుడు జంపన్నను మంగళవారం కన్నెపల్లి నుంచి సాయంత్రం ఊరేగింపుగా మేడారానికి తీసుకువచ్చారు. ఇక్కడ జంపన్నవాగు వద్ద ఉన్న గద్దెపైకి రాత్రికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు.

కన్నెపల్లి నుంచి సారలమ్మ..
సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చే క్రతువు ఇవాళ (ఫిబ్రవరి 5) కోలాహలంగా జరగనుంది. దీనితోనే జాతర ప్రారంభం అవుతుంది. కన్నెపల్లి గ్రామంలో సారలమ్మ గుడి నుంచి సాయంత్రం 4 గంటలకు డోలుతో ఊరేగింపుగా బయలుదేరి జంపన్న వాగు దాటి (వంతెన పైనుంచి కాకుండా వాగులో నడుచుకుంటూ) ఆలయానికి చేరుకుంటారు. సారలమ్మను రాత్రి 8 గంటల కల్లా గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును పూజారులు బుధవారం గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. జాతరలో భాగంగా మొదటి రోజు సారలమ్మ ఆమె తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో మహా జాతర తొలి ఘట్టం ముగుస్తుంది.

గురువారం గద్దెపైకి సమ్మక్క
రెండోరోజు జాతరలో చిలకల గుట్టమీద నుంచి సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం జరుగుతుంది. గురువారం సాయంత్రం సమయానికి పూజారులు చిలుకల గుట్టపైకి చేరుకొని సమ్మక్కకు పూజలు నిర్వహించి గద్దెలపైకి తీసుకొస్తారు. ఈ సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపే సంప్రదాయం ఉండగా, ఈసారి జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ సమ్మక్కకు స్వాగతం పలుకుతూ గాలిలోకి కాల్పులు జరపనున్నారు. శుక్రవారం నాటికి దేవతలంతా గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. మళ్లీ శనివారం దేవతల వన ప్రవేశ క్రతువుతో జాతర ముగుస్తుంది.

Also Read: కేటీఆర్, హరీశ్‌లకు ఐటీశాఖ నోటీసులు! ‘కూలి పనే’ కొంపముంచిందా?

ఈసారి ప్లాస్టిక్ రహిత జాతరగా..
మేడారం జాతరలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించారు. వీరిని మేడారానికి వెళ్లే రహదారులపై ఉన్న చెక్‌పోస్టుల వద్ద, జాతరలో ఉంచారు. ఒకవేళ భక్తులు ప్లాస్టిక్ కవర్లు, సీసాలు వంటివి వాడుతున్నట్లయితే వాటిని వాలంటీర్లు తీసేసుకోనున్నారు. బదులుగా జూట్ బ్యాగులను అందించనున్నారు. వీటి కోసం జిల్లా యంత్రాంగం గతంలోనే ప్రజల నుంచి పాత వస్త్రాలను సేకరించింది. టైలర్ల సాయంతో వాటిని బ్యాగులుగా కుట్టించింది.

ప్లాస్టిక్ రహిత మేడారం జాతర కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించింది. జాతరలో ప్లాస్టిక్ వాడొద్దనే సందేశాన్ని చక్కగా అవగాహన కల్పించిన వారిలో ఉత్తమమైనవారిని ఎంపిక చేసి, వారికి సెలబ్రిటీ దర్శనం కల్పిస్తామని ప్రకటించింది. కానీ, ఈ అవకాశాన్ని ఫిబ్రవరి 4 వరకే పరిమితం చేసింది. ఈ విషయాన్ని మేడారం జాతర అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు.

Also Read: మేడారానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు.. 66 కి.మీ. అడవిలో కాలినడకన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.