యాప్నగరం

నూతన సచివాలయం డిజైన్.. సీఎం కేసీఆర్ తొలి విదేశీ పర్యటనతో లింక్.. ఆసక్తికర చర్చ

తెలంగాణ నూతన సచివాలయ డిజైన్ మలేసియా ప్రధాని కార్యాలయం ఉండే పెర్దానా పుత్ర ప్యాలెస్‌ను పోలి ఉందనే చర్చ మొదలైంది. 2014 ఆగస్టులో కేసీఆర్ మలేసియా వెళ్లిన సమయంలో ఆ ప్యాలెస్ ముందు ఫొటో దిగారు.

Samayam Telugu 7 Aug 2020, 8:57 am
తెలంగాణ నూతన సచివాలయ డిజైన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త భవన సముదాయం నిర్మాణం కోసం రూ.400 కోట్లకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. టెండర్లను ఆహ్వానించి.. ఆగష్టు నెలాఖరులోగా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి.. అక్టోబర్‌లో పనులు ప్రారంభించాలనే భావనలో ప్రభుత్వం ఉంది. కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు కాబట్టి.. ఆరు అంతస్థుల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారనే ప్రచారం జరగ్గా.. చివరకు ఏడు అంతస్థుల్లో ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Samayam Telugu kcr at malaysia palace


పాత సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభించగానే.. నూతన సచివాలయ భవన సముదాయ డిజైన్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ డిజైన్‌నే కొద్దిపాటి మార్పులతో ఖరారు చేశారు. ఈ భవనం బెంగళూరు విధానసౌధ తరహాలో ఉందని.. వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీలా ఉందని.. రకరకాలుగా పోలికలు బయటకొచ్చాయి.
కానీ ఇటీవల సచివాలయ డిజైన్ గురించి మరో ఆసక్తికర ప్రచారం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసిన సచివాలయం డిజైన్ మలేషియా ప్రధాని కార్యాలయం ఉండే పెర్దానా పుత్ర తరహాలోనే ఉందని టాక్ నడుస్తోంది. 2014లో సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ అదే ఏడాది ఆగష్టులో మలేసియా వెళ్లారు. సీఎం హోదాలో కేసీఆర్ తొలి విదేశీ పర్యటన అది. పుత్రజయలోని ఈ ప్యాలెస్‌ను సందర్శించిన కేసీఆర్.. తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఫొటో దిగారు.

ఇప్పుడు కొత్త సచివాలయ డిజైన్ దాదాపు మలేసియా పీఎం ఆఫీసు ప్యాలెస్ తరహాలోనే ఉండటం గమనార్హం. మలయ్, ఇస్లామిక్, యూరోపియన్ శైలుల కలబోతగా పెర్దానా పుత్ర ప్యాలెస్‌ను నిర్మించారు. 1997లో నిర్మాణం ప్రారంభించి.. రెండేళ్లలో పూర్తి చేశారు. అన్నట్టు ఈ ప్యాలెస్ ఆరు అంతస్తుల్లో ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.