యాప్నగరం

తెలంగాణలో మద్యం ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మార్చి 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన మద్యం దుకాణాలు మళ్లీ బుధవారం తెరుచుకుంటున్నాయి. కాగా మద్యం ధరలను తెలంగాణ సర్కారు స్వల్పంగా పెంచింది.

Samayam Telugu 6 May 2020, 8:26 am
తెలంగాణలో మద్యం అమ్మకాలకు కేసీఆర్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటైన్మెంట్ ఏరియాలు మినహా మిగతా అన్ని జోన్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లిక్కర్ షాపులను తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 2200 మద్యం దుకాణాలు నేటి నుంచి (బుధవారం) తెరుచుకోనున్నాయి. మద్యం దుకాణాలకు వెళ్లే వారు భౌతిక దూరం పాటించాలని సీఎం కేసీఆర్ సూచించారు. మాస్క్ లేకుండా వెళ్లిన వారికి మద్యం విక్రయించొద్దని వైన్స్ షాపులకు సూచించారు.
Samayam Telugu మద్యం దుకాణం


కేసీఆర్ సర్కారు మద్యం ధరలను 16 శాతం వరకు పెంచింది. పేదలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ ధరలను 11 శాతం పెంచిన ప్రభుత్వం.. మిగతా బ్రాండ్లపై 16 శాతం వరకూ ధరలను పెంచింది. ధరలను భారీగా పెంచాలని ప్రతిపాదనలు వచ్చినా.. ఇతర రాష్ట్రాల మాదిరిగా తాము 50 శాతం, 75 శాతం వరకు పెంచాలని భావించలేదన్నారు.

లాక్‌డౌన్ తొలగించిన తర్వాత.. పెంచిన మద్యం ధరలను తగ్గించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ధరల పెంపుపై అన్ని వర్గాలతో సమీక్షించామన్నారు. పెంచిన ధరల ప్రకారం.. 90 రూపాయలు ఉన్న క్వార్టర్ లిక్కర్ బాటిల్ రూ.100 కానుండగా, రూ.130 ఉండే బాటిల్ ధర రూ.150కి పెరగనుంది. పక్కన ఉన్న ఏపీలో మద్యం ధరలు 75 శాతం పెరగ్గా... తెలంగాణలో 16 శాతం మాత్రమే పెరగడం మందు బాబులకు ఊరటనిచ్చే అంశంగా భావించొచ్చు.

కరోనా వైరస్ పూర్తిగా నశించకుండానే తెలంగాణలో మద్యం దుకాణాలను తెరవడం తనకు ఇష్టం లేకపోయినా తప్పలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చిన సడలింపుల మేరకు తెలంగాణ పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మద్యం షాపులను తెరిచారని కేసీఆర్ తెలిపారు. పొరుగున ఉన్న ఈ రాష్ట్రాల నుంచి లిక్కర్ స్మగ్లింగ్ పెరిగిపోవడం, సరిహద్దు గ్రామాల ప్రజలు మద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లొచ్చే అవకాశం ఉండటంతో.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

Read Also: మాస్కు లేకుండా గడప దాటాడు.. రూ.500 ఫైన్ కట్టాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.