యాప్నగరం

‘ఛీ’ఆర్ఎస్‌తో సవాసం.. ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు: అమిత్ షాకు రేవంత్ దిమ్మతిరిగే ప్రశ్నలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అమిత్ షాకు 9 ప్రశ్నలను సందిస్తూ ట్వీట్ చేశారు. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ ఒట్టి బూటకమని అర్థమైందన్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 14 May 2022, 3:00 pm
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తే.. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ప్రశ్నల పరంపర కొనసాగించారు. ‘అమిత్ షా గారూ.. ‘ఛీ’ఆర్ఎస్‌తో సావాసం.. తెలంగాణ ప్రజలకు ఇద్దరూ కలిసి చేసిన మోసంతో పాటు తెలంగాణ ఆత్మగౌరవంపై మోదీ దాడి, రైతుకు అన్యాయం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు వీటిపై నా 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..’ అంటూ ప్రశ్నలు అడిగారు.
Samayam Telugu రేవంత్ రెడ్డి


మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాడటం లేదన్న సామెత కేంద్ర సర్కార్‌కు అతికినట్లు సరిపోతుందని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ ఒట్టి బూటకమని అర్థమైందన్నారు. ఎరువుల సబ్సిడీలు ఎత్తేసి కేంద్రం.. రైతుల నెత్తిన బరువు మోపిందని ఆక్షేపించారు. బ్యాంకులను రూ.వేల కోట్లకు ముంచిన బడాబాబులు దేశాన్ని వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే.. రైతుల రుణాలను మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

కేసీఆర్ అవినీతిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు..
‘ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు మార్చి.. రీ డిజైనింగ్ పేరుతో సీఎం కేసీఆర్‌ కమీషన్లు దండుకున్నారని మేం మొదటి నుంచి ఆరోపిస్తున్నాం. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా?’ అని రేవంత్ ప్రశ్నించారు. ‘తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా గడిచిన వానాకాలం నుంచి తెలంగాణ రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు వడ్ల కుప్పలపై గుండె పగిలి చనిపోయారు. ఈ మరణాలకు బాధ్యులు మీ రెండు పార్టీలు కాదా?’ అని నిలదీశారు

ప్రధాని అనుచిత వ్యాఖ్యలపై మీరేమంటారు?
‘గత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పక్షాన అప్పుడే మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాం. మీరు స్పందించలేదు. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న సందర్భంగా మీరు ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మీ రాకను తెలంగాణ సమాజం ఎట్లా ఆమోదిస్తుందనుకుంటున్నారు? మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదని మీరు భావిస్తున్నారా?’ అని షాను అడిగారు.

పసుపు బోర్డు ఏమైంది?
‘మీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచార సందర్భంగా మీ పార్టీ అగ్ర నేత రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు. ఆ మేరకు ధర్మపురి అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ మీద కూడా రాసిచ్చారు. వీరిద్దరి మాటలు విశ్వసించిన నిజామాబాద్ ప్రజలు అర్వింద్‌ను ఎంపీగా గెలిపించారు. మూడేళ్లవుతున్నా పసుపు బోర్డు ఊసే లేదు. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లాంటి బృహత్తర పథకాలకు కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం హామీ ఇచ్చింది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటికీ మంగళం పాడారు. మీకు మా ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వాలి? విభజన చట్టం హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీకి మోక్షం ఎప్పుడు?’ అని షాను నిలదీశారు.


భద్రాద్రి రాముడికి చోటేది?
‘అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా ‘రామాయణం సర్క్యూట్’ పేరిట శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రవేశ పెట్టారు. 7,500 కి.మీ. సాగే ఈ సర్క్యూట్‌లో భద్రాద్రి రాముడికి చోటు దక్కలేదు. అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒక్కరు కాదా? ఒడిశాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి స్వయంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. ఈ కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించాం. ఇంత వరకూ దీనిపై అతీగతీ లేదు. కారణమేంటి? కేసీఆర్ అవినీతి విషయంలో మీరు నిజంగా అంత సీరియస్‌గా ఉంటే.. అది చేతల్లో ఎందుకు కనిపించడం లేదు?’ అని అడిగారు.

తెలంగాణ గడ్డపై అమిత్ షా అడుగుపెట్టే వేళ.. కేటీఆర్ ఎదురు దాడి.. ప్రశ్నాస్త్రాల సంధింపు
మీ చట్టాలకు వారి మద్దతు.. వారి అవినీతికి మీ మద్దతు
పొరుగున ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి కూడా జాతీయ హోదా ఇవ్వాలన్న ఆలోచన మీకు రాలేదు. మీ దుర్మార్గ చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు.. వారి అక్రమాలు అవినీతికి మీ మద్దతు.. ఇదే కాదా ఎనిమిదేళ్లుగా జరిగింది? 2014లో కాంగ్రెస్‌ అధికారం నుండి దిగిపోయే నాటికి పెట్రోల్ ధర రూ.71.41 పైసలు, డీజిల్ ధర రూ.55.49 పైసలు. గ్యాస్ సిలిండర్‌ ధర రూ.470 ఉన్నది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.119.66 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.105.65 పైసలు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1,052కి ఎగబాకాయి. ఇంతలా జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి?’ అని రేవంత్ ప్రశ్నించారు. పై ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెలంగాణకు ఏ మొహం పెట్టుకొని వస్తారని అడిగారుు. ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయాలనుకునే మీ కుతంత్రం ఇక్కడ పని చేయదంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.